MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో 165 రోజులు తిహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఆగస్టు 27న జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే ఆమె జైలు బయట ఆవేశంగా మాట్లాడారు. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు. తాను మొండినని, జగమొండిగామార్చారని తెలిపారు. ఇక తాను కేసీఆర్ కూతురునని, తాను ఎలాంటి తప్పు చేయనని స్పష్టం చేశారు. ఆగస్టు 28న హైదరాబాద్‌కు వచ్చిన కవిత.. తన ఇంట్లో అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. కుటుంబ సభ్యులతో గడిపారు. ఆగస్టు 29న ఆమె ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. తండ్రి పాదాలకు నమస్కరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పది రోజులు ఫామ్‌హౌస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. కవిత చేతిలో నిమ్మకాయ. మెడలో కరుంగలి మాల దర్శనమిస్తున్నాయి. అసలు ఏంటీ ఈ మాల ప్రత్యేకత అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఆ ప్రాముఖ్యత ఉన్నవారే..
జ్యోతిష్యుల వాదన ప్రకారం ఈ కరుంగలి మాలను ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత ఉన్న వారే దీనిని ధరిస్తారట. ఈ మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారు. ఆ చెట్టుకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఆ చెట్టుకు ఉంటుంది. అందుకనే ఈ చెట్టుని ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్, పాత ఇళ్ళల్లో తలుపులు వంటి చోట ఎక్కువగా వినియోగించేవారు. ఈ చెట్టు నలుపు రంగులో ఉంటుంది. ఇక జ్యోతిష శాస్త్రపరంగా చెప్పాలంటే నల్లరంగు అనేది అంగారక గ్రహానికి చెందిన రంగుగా చెప్తారు.
మాల ధరిస్తే కలిగే ఫలితాలు..
ఇక ఈ కరుంగలి మాల ధరిస్తే ఎబోనీ మార్స్ ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని, నల్ల మచ్చతో తయారు చేసిన వాటిని ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తక్కువగా ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ కరుంగలి చెట్టుకి ఆయుర్వేద గుణాలు కూడా ఉండటం విశేషం. రేడియేషన్ ను స్వీకరించి నిల్వ చేస్తుందట. వేరు, బెరడును మధుమేహం, పెద్దప్రేగు రుగ్మతలు, రక్తహీనత సహా పలు వ్యాధులకు ఉపయోగిస్తారు. షుగర్ ఉన్న వాళ్ళు చెట్టు వేరుని నానబెట్టి ఆ నీళ్లు తాగితే మంచిది అని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
ఏ రోజు ధరించాంటే..
కరుంగలి మాల విషయానికి వస్తే కరుంగలి మాలను ఏదైనా మంచి రోజున ధరించవచ్చు. మంగళవారం నాడు మురుగన్ ఆలయంలో కానీ, వారాహి మాత ఆలయంలో కానీ పూజ చేయించి ఆ తర్వాత ధరించాల్సి ఉంటుంది. దీనికి కులాలు, మతాలతో సంబంధం లేదు. పడుకునే ముందు దేవుడు దగ్గర పెట్టి లేచిన తర్వాత స్నానం చేసి మళ్లీ ధరించాలి. అంగారక దోషం ఉన్న వారు ఈ మాలను ధరిస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. విద్యార్థులు జ్ఞాపకశక్తి అలాగే మేధో శక్తిని మెరుగుపరుచుకోవడానికి ఈ మాల ధరిస్తారట.