Hyderabad: కంటేనే అమ్మ అనే ఈ లోకం.. కనని అమ్మల బాధను ఎందుకు పట్టించుకోదు?

హైదరాబాద్ నగరంలో ఇటీవల పోలీసులు ఒక స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16 మంది పిల్లలను తమ అదుపులోకి తీసుకొని.. శిశువిహార్ కు తరలించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 29, 2024 3:54 pm

Hyderabad

Follow us on

Hyderabad: ” కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కడుపు తీపి తెలియని అమ్మ ఒక బొమ్మ కదా. రాతి బొమ్మే కదా” అప్పట్లో విడుదలైన ప్రేమించు అనే ఓ సినిమాలో బహుళ ప్రజాదరణ పొందిన పాట ఇది.. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా ఒక సంచలనం. పెంచిన తల్లికి, కన్నతల్లికి మధ్య నలిగిపోయే అంధురాలి జీవితం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. అది సినిమా కాబట్టి.. కొంతమేర దర్శకుడికి లిబర్టీ ఉంటుంది. మరి అదే నిజ జీవితంలో అయితే.. అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా? అనే అనుమానం మీకు ఉండొచ్చు.. కానీ ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారం ప్రేమించు సినిమాను గుర్తుకు తెస్తోంది.

హైదరాబాద్ నగరంలో ఇటీవల పోలీసులు ఒక స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16 మంది పిల్లలను తమ అదుపులోకి తీసుకొని.. శిశువిహార్ కు తరలించారు. అయితే ఇక్కడ పోలీసుల పనితీరు మెచ్చుకోదగ్గదే. పైగా చిన్న పిల్లల అక్రమ రవాణా నేరం కూడా. అయితే ఆ అక్రమార్కులు విక్రయించిన చిన్న పిల్లలు.. వారిని కొనుగోలు చేసిన తల్లిదండ్రుల వద్ద స్వేచ్ఛగా బతుకుతున్నారు. దర్జాగా పాలు తాగుతున్నారు. మెరుగ్గా ఎదుగుతున్నారు. ఈ పిల్లల్ని కొనుగోలు చేసిన వారంతా.. పిల్లల్ని కనలేని వారే. కొందరికి ఇళ్ల తరబడి ప్రయత్నాలు చేసిన పిల్లలు కాలేదు. ఇంకా కొంతమంది ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయారు. ఇంకా కొంతమంది అయిన వాళ్ళు లేక.. ఈ పిల్లలను కొనుగోలు చేసి.. వారే లోకంగా బతుకుతున్నారు.. ఆ పిల్లలకు కన్న ప్రేమ ఎప్పుడో దూరమైంది. కన్నవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియకుంది. అలాంటప్పుడు ఈ పెంచిన ప్రేమే వారిని దగ్గరికి తీసుకుంది. వారి బాగోగులు చూస్తోంది. వారి మంచిలో తోడుగా ఉంటుంది. చెడుకు దూరంగా ఉంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఆ పిల్లల్ని ఆ తల్లిదండ్రుల నుంచి దూరం చేయడం సబబేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

వాస్తవానికి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న పిల్లలను వారిని పెంచిన తల్లిదండ్రులు అక్రమ మార్గంలోనే కొనుగోలు చేశారు.. ఆ పిల్లలను విక్రయించిన వారు మాత్రం దండిగా వెనకేసుకున్నారు. వారికి పిల్లల్ని అక్రమ రవాణా చేయడం.. విక్రయించడం మాత్రమే తెలుసు. వారి వద్ద నుంచి పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు మాత్రం.. ప్రేమను అందించడం మాత్రమే తెలుసు.. తమకు భగవంతుడు ఇవ్వని అదృష్టాన్ని.. ఆ పెంచిన పిల్లల్లో చూసుకోవడం మాత్రమే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లల్ని వారి వద్ద నుంచి దూరం చేస్తే.. ఆ గుండెలు ఏం కావాలి.. ఇన్నాళ్లు పెంచిన ప్రేమ ఎటు వెళ్లాలి.. ఇప్పుడిప్పుడే ఆ పిల్లలు వారిని అమ్మానాన్న అని పిలుస్తుంటే.. ఆ పిలుపు ఇక దూరం అవుతుందని తెలిస్తే.. వారికి ఎంతటి బాధ ఉండాలి.. ఇలాంటప్పుడే ప్రభుత్వం కొంచెం సుహృద్భావ హృదయంతో ఆలోచిస్తే.. ఆ పిల్లల బతుకు బాగుంటుంది.. వారిని పెంచుతున్న తల్లిదండ్రుల ఆకాంక్ష కూడా నెరవేరుతుంది.