Journalist elections : జర్నలిస్టులు గాడి తప్పుతున్నారా అంటే.. చాలా మంది ఎప్పుడో గాడి తప్పారు అంటారు. ఒకప్పుడు పత్రికలో ఏదైనా శాఖ గురించి గానీ, అధికారి గురించి గానీ అవినీతి, అక్రమాలు, పనితీరు సరిగా లేదని వార్త వస్తే.. వెంటనే చర్యలు ఉండేవి. కానీ, ఇప్పుడు అవినీతి పరులు కూడా ‘రాస్తే రాసుకో’ అని లైట్ తీసుకుంటున్నారు. ఇందుకు కారణం ప్రతికా యాజమాన్యాలే. ఒకప్పుడు ప్రజల పక్షాన నిలిచే యాజమాన్యాలు ఇప్పుడు పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి. దీంతో జర్నలిజం విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి. యథా యాజమాన్యాలు.. తథా జర్నలిస్టులు అన్నట్లుగా ఇప్పుడు జర్నలిస్టులు కూడా మారిపోతున్నారు. ఒకప్పుడు జర్నలిస్టు యూనియన్ ఒక్కటే ఉండేది. కానీ, నేడు పార్టీల వారీగా యూనియన్లు ఏర్పడుతున్నాయి. ఇది మంచిదే. కానీ ఏ యూనియన్ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా మారిపోయింది. యూనియన్లు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయకుండా.. లీడర్ల స్వప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనియన్లలో విభేదాలు వస్తున్నాయి. విలువలు దిగజారిపోతున్నాయి. జర్నలిస్టులు ఆపదలో ఉన్నా ఆదుకునే పరిస్థితి లేకుండా పోతోంది. కరీంనగర్‌లో ఇటీవల జరిగిన జర్నలిస్టు యూనియన్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం.
ఏకఛత్రాధిపత్యం..
కరీంనగర్‌లోని ఓ జర్నలిస్టు ఓ జర్నలిస్టు యూనియన్ లో దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నాడు. ఓ పెద్దమనిషే అక్కడ చక్రం తిప్పుతున్నాడు. తనకు పోటీ ఉండకూడదన్న భావనతో జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి.. ఎన్నికలు లేకుండానే ఏకాభిప్రాయం సాకుతో తన బినామీలను అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఇతర సభ్యులుగా నియమించుకుంటూ మరొకరికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అయితే నియమించుకున్న కార్యవర్గం జర్నలిస్టుల సంక్షేమానికి పనిచేయడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల్లో వ్యతిరేకత పెరిగింది. ఈ క్రమంలో చక్రం తిప్పుతున్న పెద్దమనిషి రాష్ట్రస్థాయిలో లీడర్‌గా కొనసాగుతూ.. కరీంనగర్ యూనియన్‌ను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడంపై జర్నలిస్టుల్లో అసహనం వ్యక్తమైంది.

ఎన్నికల్లోనూ చక్రం తిప్పిన పెద్ద మనిషి..
ఇక 2024, డిసెంబర్ 11న కరీంనగర్ జిల్లా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిల్లోనూ ఏకాభిప్రాయం మంత్రం జపించాలనుకున్నారు. కానీ, పోటీ పెరగడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లోనూ సదరు పెద్ద మనిషి చక్రం తిప్పాడు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో జర్నలిస్టులను మచ్చిక చేసుకునేందుకు విందులు ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ రోజు ఓటింగ్ ఏకపక్షంగా జరుగుతున్నట్లు గుర్తించిన సదరు లీడర్.. సభ్యత్వం లేని అనేక మందిని చివరి గంటలో పెద్ద ఎత్తున రప్పించి ఓన్నికల్లో తాను నిలబెట్టిన కార్యవర్గానికి అనుకూలంగా ఓట్లు వేయించారు. దీంతో చివరి గంటలో 50 నుంచి 70 మంది జర్నలిస్టు ఓటరు జాబితాలో పేరు లేనివారు ఓట్లు వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా పెద్దమనిషి పంతం నెగ్గించుకున్నాడు. కేవలం 13 ఓట్ల తేడాతో తన మద్దతుదారులను గెలిపించుకున్నాడు.
కోర్టుకు చేరిన పంచాయితీ..
కరీంనగర్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్లూజే) ఎన్నికల వ్యవహారం హైకోర్టుకు చేరింది. టీయూడబ్లూజే కరీంనగర్ విభాగంలో సభ్యత్వ నమోదులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ యూనియన్ సభ్యుడైన చెలుకల రామకృష్ణా రెడ్డి ఎన్నికలకు ముందు కలెక్టర్, కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అనంతరం అదే ఎన్నికల్లో పోటీ చేసిన రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రక్రియపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. సభ్యత్వ జాబితా అందుబాటులో ఉంచకపోవడం, సభ్యత్వం జరిగిన తీరుపై అనేక సందేహాలను వ్యక్తపరిచారు. అయినా, ఎన్నికలు నిర్వహించిన అడ్‌హక్ కమిటీ, ఎన్నికల అధికారులు పట్టించుకోకుండా గతేడాది డిసెంబరు 11వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా, అదనంగా పలు సభ్యత్వాలు చేర్చడం, వారికి అప్పటికపుడు ఓటు వేసే అధికారంతోపాటు ఎన్నికల్లో నిలుచునే అవకాశం కూడా కల్పించారన్న ఆరోపణలు రావడం పెద్ద దుమారానికే దారితీసింది.
అధికారులకు ఫిర్యాదు..
దీంతో చెలుక రామకృష్ణారెడ్డి అనే జర్నలిస్ట్ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, పూర్తిగా ఒకవర్గానికి కొమ్ముకాసేలా అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ డిసెంబరు 16న కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో యూనియన్ బైలాస్‌కు వ్యతిరేకంగా మేనేజింగ్ ఎడిటర్లు, యాజమాన్య ప్రతినిధులకు, స్థానికేతరులకు, విలేకరులు కానివారికి సభ్యత్వం కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో యూనియన్‌లో ఆఫీస్ బేరర్లుగా పనిచేసిన వారితోపాటు పలువురు సీనియర్ సభ్యులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. అయితే ఈ ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదు.
చివరకు హైకోర్టుకు..
అధికారులు ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో యూనియన్ సభ్యుడు రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఎన్నికల్లో సభ్యత్వం విషయంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, తాజాగా జరిగిన కరీంనగర్ టీయూడబ్ల్యూజే శాఖ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన అధ్యక్షుడు యూనియన్ నిబంధనల ప్రకారం ప్రాథమిక సభ్యత్వానికే అనర్హుడని, సంబంధిత సాక్ష్యాలతో హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు రెండు వారాల్లో సంబంధిత అధికారులు యూనియన్ సభ్యుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్, కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం కరీంనగర్ జర్నలిస్ట్ యూనియన్ లో చర్చనీయాంశమైంది.