Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికల వేళ.. విశ్వనగరం హైదరాబాద్‌లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణ కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం సోమవారం(మే 13న) జనం లేక వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లడంతో నగరంలోని రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇది హైదరాబాదేనా అనే అనుమానం వచ్చేలా నిర్మానుష్యంగా మారింది.
మూడేళ్ల తర్వాత మళ్లీ ఇలా..
కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూతో హైదరాబాద్‌లో రోడ్లు ఖాళీగా కనిపించాయి. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు కర్ఫ్యూ ప్రకటించకపోయినా.. ఇలా ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూకట్‌పల్లి, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మియాపూర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిఓ్తంది. ఈ ఏరియాల్లో ఏపీ వాసులు అధికంగా ఉంటారు. వారంతా ఓటేసేందుకు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. దీంతో మహానగరం ట్రాఫిక్ ఫ్రీగా మారింది.
ఫ్లై ఓవర్లు ఖాళీ..
ఇక హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లు కూడా జనం లేక, వాహనాలు రాక బోసిపోయి కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా కనిపించే ఫ్లై ఓవర్లు ఇప్పుడు కళ తప్పాయి. నిత్యం ట్రాఫిక్ రణగొణ ధ్వనులతో మార్మోగే విశ్వనగరం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. ఇంతటి నిర్మానుష్యాన్ని చూసి నగరవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఔరా.. ఇది హైదరాబాదాదేనా అని అనుమానిస్తున్నారు. విశ్వనగరంలో ఉన్నామా.. మారుమూల గ్రామంలో ఉన్నామా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.