KTR gave a big shock: తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదంటే ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా పోరాడుతానంటూ చెప్పుకొచ్చారు. అందులోభాగంగా ఇటీవల కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనకు, తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారని ఆయన పేర్కొన్నారు. తాజాగా.. కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి గట్టి షాక్ ఇచ్చారు. సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసు పంపించారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.
కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నెల 19వ తేదీన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఈ మేరు సంజయ్‌కి నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగులో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా సంజయ్ ప్రస్తావించారని నోటీసుల్లో పేర్కొన్నారు. సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా.. ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.
తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కేంద్ర మంత్రి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని సవాల్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి తన పరువుకు భంగం కలిగించారని పేర్కొన్నారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని అన్నారు. వాటిపై వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందన్నారు. తన పార్టీ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. 9 ఏళ్లు రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేశానని, కానీ.. ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలోనూ సంజయ్ తనపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఇలా తన వ్యక్తిత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలకు పాల్పడిన సంజయ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోపు క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించారు. కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. నోటీసులకు రిప్లై ఇస్తారా..? లీగల్‌గా ఎదుర్కొంటారా..? అనేది ఆసక్తికరంగా మారింది.