https://oktelugu.com/

Hyderabad: భాగ్యనగరానికి డేంజర్‌ బెల్స్‌… మరో బెంగళూర్‌ కాబోతుందా?

హైదరాబాద్‌ను ఈ నివేదిక భయపెడుతోంది. వాస్తవానికి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం హైదరాబాద్‌లో 185 నోటిఫైడ్‌ నీటి కుంటలు ఉన్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 9, 2024 / 02:20 PM IST

    Hyderabad

    Follow us on

    Hyderabad: వేసవి వచ్చేసింది. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్‌లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సీయస్‌కుపైగా నమోదవుతున్నాయి. ఇంకా మే నెల మిగిలే ఉంది. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేలా ఎండలు కొట్టడం ఖాయం. మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో భాగ్యనగరానికి బిగ్‌ అలర్ట్‌ తెరపైకి వచ్చింది.

    బెంగళూరు పరిస్థితేనా..
    హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు అన్న అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే బెంగళూరు నీటి ఎద్దడితో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇటీవల వెల్లడించిన ఓ అధ్యయనంలో కాంక్రీట్‌ నిర్మాణాలు పది రెట్లు పెరగడం కారణంగా భూగర్భ నీటిమట్టాలు 79 శాతం తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పరిస్థితి ఏమిటి అన్న చర్చ జరుగుతోంది.

    పెరిగిన బెంగళూరు విస్తరణ..
    బెంగళూరు పట్టణ విస్తరణ 1973లో 8 శాతం ఉండగా, 2023 నాటికి 93.3 శాతానికి పెరిగింది. ఈమేరకు నీటి వనరులు పెరగలేదు. పట్టణ విస్తరణ పెరగడానికి, నీటి మట్టాలు తగ్గడానికి బలమైన సంబంధం ఉందని అధ్యయనం తెలిపింది. పట్టణం అంతా కాంక్రీట్‌ జంగిల్‌ కావడంతో నీరు ఇంకే అవకాశం లేక భూగర్భ జలాలు క్రమంగా పడిపోతూ వచ్చాయని వెల్లడించింది.

    హైదరాబాద్‌ కూడా..
    ఇప్పుడు హైదరాబాద్‌ను ఈ నివేదిక భయపెడుతోంది. వాస్తవానికి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం హైదరాబాద్‌లో 185 నోటిఫైడ్‌ నీటి కుంటలు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం కలుషితం అవగా 20 వనరులు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో హైదరాబాద్‌కు కూడా నీటి సమస్య తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సిటీ ఔట్‌కట్స్‌లో తీవ్ర నీటి సమస్య మొదలైంది. ఈ నేపథ్యంలో… ఇప్పటికైనా వర్షపునీరు భూమిలో ఇంకేలా చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటి గుంతలు ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. లేదంటే హైదరాబాద్‌ కూడా త్వరలోనే మరో బెంగళూరు అవుతుందని హెచ్చరిస్తున్నారు.