Homeఆంధ్రప్రదేశ్‌KTR And Jagan: వైసీపీ శ్రేణులు గొప్పగా చెబుతున్నాయి గాని.. గతంలో జగన్ పాలన గురించి...

KTR And Jagan: వైసీపీ శ్రేణులు గొప్పగా చెబుతున్నాయి గాని.. గతంలో జగన్ పాలన గురించి కేటీఆర్ ఏమన్నాడో తెలుసా?

KTR And Jagan: రాజకీయాలలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తో దోస్తీ కట్టాడు కెసిఆర్. ఆ తర్వాత కెసిఆర్ పార్టీలో ఎమ్మెల్యేలను ఆకర్షించి వైయస్ కాంగ్రెస్లో చేర్చుకున్న తర్వాత.. కెసిఆర్ కు తత్వం బోధపడింది. ఆ తర్వాత కెసిఆర్ సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ వైఎస్ ను తిట్టిపోశాడు. ఒక రకంగా తెలంగాణకు బద్ధ శత్రువు వైయస్ అని ఒక సభలో పేర్కొన్నాడు కూడా. వైయస్ గతించిన తర్వాత తెలంగాణ ఉద్యమం మరో స్థాయికి చేరుకుంది. తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది. ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు.

తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లో వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీని తన పార్టీలో చేర్చుకున్నాడు కేసీఆర్. కొంతకాలానికి జగన్ తో సన్నిహిత సంబంధాలు కేసీఆర్ కు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల్లో రిటర్న్ గిఫ్టులో భాగంగా కేసీఆర్ జగన్ కు సహాయం చేశాడు అంటారు.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి కెసిఆర్ హాజరయ్యారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో కూడా జగన్ ముఖ్యమంత్రి హోదాలో కనిపించారు. ప్రగతి భవన్ కు సతీసమేతంగా జగన్ వెళ్లారు. జగన్ ఆస్థాన మీడియా మరో నమస్తే తెలంగాణగా మారిపోయి.. కెసిఆర్ పరిపాలనకు పది సంవత్సరాలపాటు నీరాజనాలు పలికింది. ఇప్పుడు ఇక రెండు రాష్ట్రాల్లో అటు కెసిఆర్.. ఇటు జగన్ (11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా రాలేదు) అధికారాన్ని కోల్పోయారు. కెసిఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి, జగన్ బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమైపోయారు.

శనివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్, కేటీఆర్ కలుసుకున్నారు. ఇద్దరు పక్కపక్కన కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ ఫోటోలను వైసీపీ నాయకులు.. గులాబీ నాయకులు సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పూర్తిగా శాసిస్తారని చెబుతున్నారు. కానీ ఇక్కడే అటు వైసిపి నాయకులు.. ఇటు గులాబీ నాయకులు అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. వారు మర్చిపోయిన సరే సోషల్ మీడియా గుర్తు చేస్తూనే ఉంటుంది.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేటీఆర్ హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ సమయంలో ఏపీలో ప్రభుత్వం గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇటీవల సంక్రాంతి సెలవులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మిత్రుడు సొంత ఊరికి వెళ్ళాడు.. అక్కడ కరెంటు లేదు. నీళ్లు రావడం లేదు. రోడ్లు బాగోలేవు. నాకు వెంటనే ఫోన్ చేసి.. సార్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి కొంతమందిని ప్రత్యేకంగా బస్సులతో ఆంధ్రప్రదేశ్ పంపించండి.. అక్కడ రోడ్లను.. ఇతర వాటిని చూపించండి. అప్పుడు వారికి మీ ప్రభుత్వం గొప్పదనం అర్థమవుతుందని అన్నాడు.. దీనిని బట్టి ఏపీలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని” కేటీఆర్ ఆసభలో వ్యాఖ్యానించారు..

నాడు వైసీపీ పరిపాలనను కేటీఆర్ తీవ్రంగా విమర్శించేవారు. అంతేకాదు ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏపీకి రోడ్లు వస్తున్నాయని.. విమానాశ్రయాలు నిర్మిస్తున్నారని.. చంద్రబాబు పరిపాలన కాలంలో ఏపీ రాష్ట్రానికి నిధులు విపరీతంగా వస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఎవరి పరిపాలన బాగుంది? ఎవరి హయాంలో ఏపీ రాష్ట్రం గొప్పగా ఉంది? అనే విషయాలపై కేటీఆర్ స్పష్టంగా చెబుతున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు ఆ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలు కేటీఆర్ గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను చూడాలని హితవు పలుకుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version