Devender Goud : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇది నూటికి నూరు శాతం వాస్తవం. నేటి రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరితో చేతులు కలుపుతుందో.. ఏ నేతలు ఎవరితో దోస్తీ చేస్తారో తెలియని పరిస్థితి. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకే వెన్నుపోటు పొడిచే నేతలు ఉన్నారు. కానీ, కొందరు మాత్రం.. ఏ పార్టీలో ఉన్నా.. తమకు రాజకీయ ఓనామాలు నేర్పి.. తమ ఎదుగుదలకు కృషి చేసిన నేతలను సందర్భోచితంగా గుర్తుచేసుకుంటారు. తాజాగా టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ దేవేందర్‌గౌడ్(Devendar Goud) కూడా తన రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన చంద్రబాబు నాయుడును గుర్తు చేసుకున్నారు. ఆయన రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని ఇటీవల తెలంగాణ సీఎం రేంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Dattatreya) చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం.. ఆ సమయంలో తాను పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిణామాలు, తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలక ఘట్టాలను గుర్తు చేసుకున్నారు.
ఆయన చలవతోనే..
ఇక ఈ సందర్భంగా తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు(Chandrababu Naiudu) గురించి కూడా దేవేందర్‌గౌడ్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడే లేకపోతే.. ఈ రోజుల్లో తాను గానీ, రేవంత్‌రెడ్డిగానీ ఉండేవారు కాదన్నారు. తమ ఉన్నతికి చంద్రబాబునాయుడు బాటలు వేశారని తెలిపారు. ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయంగా ఎదిగామన్నారు. తాను హోం మంత్రిగా పని చేశానని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని పేర్కొన్నారు. ఒక దశలో టీడీపీలో తాను నంబర్ 2 స్థానానికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. నాడు పార్టీ, పదవుల కన్నా తెలంగాణ ముఖ్యమని నమ్మి టీడీపీని వీడినట్లు వెల్లడించారు.
రాజకీయాల్లో చర్చ..
ఇదిలా ఉంటే.. దేవేందర్‌గౌడ్ స్పీచ్ ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి ప్రస్తుతం బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్(Congress)తోపాటు, బీజేపీలో ఉన్న చాలా మంది నేతలు టీడీపీ నుంచి వచ్చినవారే. ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చొరవతో రాజకీయాల్లో ఎదిగినవారే. కానీ, తెలంగాణ సాధించుకున్న తర్వాత చంద్రబాబునాయుడిపై తెలంగాణ సమాజంలో విషబీజం నాటారు కేసీఆర్. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించారు. చంద్రబాబు గెలిస్తే.. తెలంగాణ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తుందని ప్రచారం చేశారు. ఇలా సెంటిమెంటును అడ్డం పెట్టుకుని తెలంగాణలో టీడీపీ(TDP)లేకుండా చేశారు. ఇక హైదరాబాద్(Hyderabad)అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎవరూ కాదనలేనిది. అయినా కేసీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని గానీ, ఆయన ఎదుగుదలకు కృషి చేసిన చంద్రబాబునాయుడును గానీ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన చంద్రబాబును గానీ ఎన్నడూ గుర్తు చేసుకున్న పాపాన పోలేదు. కానీ ఏ రాజకీయ పార్టీకి అంతం కాదు. కొంతకాలం బలహీన పడుతుంది అంతే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టారు.