Karimnagar: బంధాలు, అనుబంధాలు దూరమవుతున్న రోజులివీ. మనిషిలో మానవత్వం మచ్చుకైనా కనిపించని కాలమిదీ. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడిపోతే.. ఆ మనకెందుకులే అని పట్టించుకోవడం మానేస్తున్నారు. పట్టించుకుంటే మనకేమైనా అవుతుందేమో అని భయపడుతున్నారు. కనీసం మాట సాయం కూడా చేయడానికి వెనుకాడుతున్న ప్రస్తుత సమాజంలో.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. కరీంనగర్ ఆర్టీసీ సిబ్బంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసి మానత్వం చాటుకున్నారు.
చీరలు అడ్డుగా కట్టి..
కరీంనగర్ బస్టాండ్‌లో ఆదివారం(జూన్ 16న) నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడింది. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోవడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందు చూపు ప్రదర్శించి.. బస్టాండ్ ఆవరణలోనే చీరలను గర్భిణి చుట్టూ అడ్డుగా కట్టారు. డెలివరీ చేశారు. ఈ విషయాన్ని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
ఒడిశాకు చెందిన వలస కూలీలు దూల, కుమారి దంపతులు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుకబట్టీలో పని చేస్తున్నారు. కుమారి నిండు గర్భిణి. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో కుంటకు వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం బయల్దేరారు. కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చారు. ఇక్కడకు రాగానే కుమారికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే భర్త దూల ఆమెను పక్కన పడుకోబెట్టి.. సాయం చేయాలని ఆర్టీసీ అధికారులను వేడుకున్నాడు. వారు 108కి సమాచారం అందించారు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్ వైజర్లు ముందుకు వచ్చారు. ఆంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేశారు. కుమారి పండంటి ఆడబిడ్డ పుట్టింది. కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రావడంతో తల్లీ బిడ్డను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆర్టీసీసిబ్బందిపై ప్రశంపలు..
గర్భిణి విషయంలో సకాలంలో స్పందించిన ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా కరీనంగర్ ఆర్టీసీ మహిళా సిబ్బందిని అభినందించారు.