Dasara Liquor Sales Hits Record: తెలంగాణలో బతుకమ్మ, దసరా పెద్ద పండుగలు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఆడిన తర్వాత ఒకరోజు గ్యాప్ తో దసరా వస్తుంది. కొన్ని సందర్భాలలో రెండు రోజుల గ్యాప్ వస్తుంది. అరుదైన సందర్భాలలో సద్దుల బతుకమ్మ తర్వాత మరుసటి రోజు దసరా నిర్వహిస్తుంటారు. దసరా అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ. ఈ పండుగకు అందరి ఇళ్లల్లో సందడి వాతావరణం ఉంటుంది. పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటుంది.
దసరా రోజు విందు వినోదాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ మాంసాహారం ఉంటుంది. మాంసాహారం తో పాటు మద్యం.. ఇతర శీతల పానీయాలను కూడా తీసుకుంటారు.. సాధారణంగా తెలంగాణ పల్లెల్లో దసరా నాడు మద్యం విక్రయాలు అధికంగా ఉంటాయి. అయితే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దసరా అక్టోబర్ 2 న రావడంతో.. ఆరోజు మద్యం దుకాణాలను మూసివేశారు. దీంతో అక్టోబర్ 1న భారీగానే మద్యం విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 30న కూడా భారీగానే అమ్మకాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 30న దాదాపు 333 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అక్టోబర్ 1న 86 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తంగా 419 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని అధికారులు అంటున్నారు.
ఈసారి స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల కావడం.. చాలామంది ఆశావాహులు పోటీలో ఉండడంతో దసరా నాడు విందులు వినోదాలు అధికంగా జరిగాయని తెలుస్తోంది. అందువల్లే మద్యం విక్రయాలు గతంతో పోల్చి చూస్తే ఎక్కువగా జరిగాయని అధికారులు అంటున్నారు. బీర్ల విక్రయాలు అధికంగా ఉండగా.. తర్వాతి స్థానంలో విస్కీ.. తర్వాత బ్రాందీ.. ఇక మిగతా స్థానాలలో ఇతర మద్యం రకాలు ఉన్నాయి.
మద్యంతోపాటు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. గాంధీ జయంతి అయినప్పటికీ చాలామంది మాంసాన్ని వినియోగించారు. గ్రామీణ ప్రాంతాలలో గొర్రెపోతులను, మేకపోతులను వధించారు. తెలంగాణలో పెద్ద పండుగ కావడంతో పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు. నగరాలు, పట్టణ ప్రాంతాలలో మాత్రమే పోలీసులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలో మాత్రం మాంసం విక్రయాలు యధావిధి గానే సాగడం విశేషం.