KK Survey: కేకే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు నూటికి 200 శాతం నిజమయ్యాయి. అన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని అంచనా వేయగా కేకే సర్వే మాత్రం వైసీపీ 11 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. అచ్చం ఇవే ఫలితాలు వచ్చాయి. దీంతో కేకే సర్వేపై చాలా మంది నమ్మకం పెరిగింది. అయితే తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేకే సర్వే తలకిందులైంది. హర్యానాలోనూ 100 శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. కేకే సర్వేనే కాదు అనేక సర్వేలు ఇవే ఫలితాలు ఇచ్చాయి. కానీ, బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఇదిలా ఉంటే.. కేకే సర్వే తాజాగా తెలంగాణలో నిర్వహించిన సర్వే రిపోర్టు విడుదల చేసింది. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా.. పాలన తీరు, ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపై సర్వే నిర్వహించింది.
రేవంత్‌రెడ్డికి వార్నింగ్..
తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ పనితీరుపై కేకే సర్వే సీఈవో కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్‌రెడ్డి అలర్ట్‌గా ఉండాలని సూచించారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్ ప్రతిపక్ష హోదాలో మాత్రం సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ తక్కువ మెజారిటీతోనే ఓడిందని గుర్తు చేశారు.
బలపడుతున్న బీఆర్‌ఎస్..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ బలపడుతోందని కిరణ్ తెలిపారు. ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడినా కేసీఆర్‌కు ఏం నష్ట లేదన్నారు. 80 శాతం ఓటర్లు బీఆర్‌ఎస్ నాయకత్వంపై నమ్మకంతోనే ఓటేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలను చూసి ఓటు వేయరని వెల్లడించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత ప్రస్తుతం బీఆర్‌ఎస్ మాత్రమే ప్రజలకు కనిపిస్తుందని తెలిపారు. బీజేపీ కనుచూపు మేరలో కూడా లేదని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో మంచి స్కోప్ ఉందని తెలిపారు.