Hyderabad: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. పాలు, నూనె నుంచి భోజనం వరకు.. జూస్‌లు, స్వీట్స్, చివకు తేనె కూడా కల్తీ అవుతోంది. పెయిన్ బామ్స్, సోప్స్, తినుబండారాలు, అల్లం పేస్టు కూడా కల్తీ అవుతోంది.. తయారుచేస్తున్నారు. తినే ఆహారానికి మంచి మార్కెట్ ఉండడంతో కొంతమంది దీనినే తమ కల్తీ దందాకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఎన్ని వీలైతే అన్ని కల్తీ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. దుకాణాల్లో అమ్మకానికి పెడుతున్నారు. ఆకర్షణీయమైన స్టిక్కరింగ్‌తో కస్టమర్లను బుట్టలో వేసుకుంటున్నారు. తాజాగా
ధరల భారంతో సామాన్యుల ఇబ్బంది..
ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతుండంతో సామాన్యులు.. ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వాటిని క్యాష్ చేసుకుని కల్తీ కేటుగాళ్లు మరీంత రెచ్చిపోతున్నారు. ఉప్పు, కారం నుండి మొదలుకొని దాదాపు అన్నిటిలోనూ కల్తీ చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో కల్తీగాళ్లు మరింతగా దిగజారిపోతున్నారు.
పంది కొవ్వుతో నూనె..
తాజాగా హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో ప్రజలు మరింత అసహ్యించుకొనే కల్తీ భాగోతం బయటపడింది. స్థానికంగా ఉండే రమేశ్ శివ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా తన నివాసంలోనే గత కొన్నేళ్లుగా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వును సేకరించి.. కొవ్వును వేడి చేసి అందులో పలు రసాయనాలు కలిపి అచ్చం వంట నూనెలా తయారు చేసి రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ దుకాణాలకు తక్కువ ధరకే అమ్ముతున్నాడు.
పక్కా సమాచారంతో సోదాలు..
కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడిచేశారు. రమేశ్ శివ ఇంట్లో తనఖీలు చేశారు. ఇందులో బండారం మొత్తం బయటపడింది. పోలీసులు ఆ కేటుగాన్ని అరెస్ట్ చేశారు.
ఆరోగ్యానికి ముప్పు
కల్తీ వస్తువులతో ప్రజారోగ్యానికి ముప్పు ఏ్పడుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. క్యాన్సర్, హార్ట్‌ఎటాక్, కిడ్నీ, లివర్ వ్యాధులకు కల్తీ సరుకులే కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. తమకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా దీర్ఘకాలిక రోగాలబారిన పడడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నాకు. కానీ కల్తీ సరుకులు, తినే ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్నాయని వైద్యులు అంటున్నారు. కల్తీవి తినడం వల్ల డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు.