Constable Jobs : ఒకే ఇంట్లో ముగ్గురికి కానిస్టేబుల్ ఉద్యోగాలు!

వరంగల్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు

Written By: NARESH, Updated On : October 8, 2023 10:03 pm

jobs

Follow us on

Constable Jobs : ఒకే కుటుంబంలో ముగ్గురికి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వరించింది. సుమారు 28 ఏళ్లుగా కుటుంబాన్ని పోషించడం కోసం ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న తండ్రి కష్టాన్ని ఎలాగైనా తగ్గించాలనే భావనతో కఠోరమైన సాధన చేసిన ఇద్దరు కొడుకులతోపాటు కోడలు పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ముగ్గురికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆర్టీసీ డ్రైవర్‌ ఆనందానికి అవధులు లేవు.

ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ..
ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్‌కాలనీలో నివాసముండే కుడుకుంట్ల గోపాల్‌ 28 ఏళ్ల కిందట మహమూబ్‌ నగర్‌ జిల్లా పెబ్బేరు నుంచి బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరాడు. అతడి భార్య శ్యామల గృహిణి. గోపాల్‌ పెద్ద కొడుకు కె.వాసు 2018లో బీటెక్‌ పూర్తిచేశాడు. అదే సంవత్సరంలో కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించినా రన్నింగ్‌లో విఫలమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కోసం చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నాడు. గోపాల్‌ చిన్న కొడుకు కె.వినయ్‌ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుతున్నాడు. ఇదిలా ఉండగా 2021 అక్టోబర్‌లో వాసుకు వనపర్తి జిల్లా జగత్‌పల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్‌ కుమార్తె భవానీతో వివాహమైంది.

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రావడంతో..
2022లో తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటినుంచి కష్టపడి చదివి.. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఫిజికల్‌ పరీక్షల కోసం కఠోరంగా శ్రమించారు. యూసుఫ్‌గూడ బెటాలియన్‌కు వెళ్లి రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌ తదితర అంశాల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ జంగయ్య వద్ద శిక్షణ పొందారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన కానిస్టేబుల్స్‌ మెయిన్‌ పరీక్షల ఫలితాల్లో ముగ్గురికి ఉద్యోగాలు రావడంతో ఆర్టీసీ డ్రైవర్‌ గోపాల్‌ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

సంగారెడ్డిలో ఒకే కుటుంబంలో నలుగురికి..
ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా సిర్దాపూర్ మండలం జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గ్రామానికి మెగావత్ నెహ్రు నాయక్, మారోని బాయి దంపతుల ఇద్దరు కుమారులు మెగావత్ రమేష్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మలోత్ రోజా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. వారంతా కలిసి పరీక్షలకు సన్నద్ధం కావడం వల్లే విజయం సాధించినట్లు వారు తెలిపారు.

వరంగల్‌ జిల్లాలో అక్కా చెల్లెలు..
వరంగల్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకబోర్డు విడుదల చేసిన తుది ఫలితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్‌ వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడుకాగా.. తల్లి అంజలి గృహిణి.