Bandi Sanjay: తెలంగాణలో కొన్నేళ్లుగా ఎలాంటి మత ఘర్షణలు జరుగడం లేదు. పోలీసుల పటిష్ట భద్రత. అన్నివర్గాలను సమన్వయం చేయడం, తదితర కారణాలతో అంతా ప్రశాతంగా సాగిపోతోంది. కానీ, తాజాగా విశ్వనగరం హైదరాబాద్‌లోనే మత ఘర్షణకు దారితీసే ఘటన జరిగింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఏరియా పరిధిలోని కుమ్మరిగూడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసి పారిపోతున్న ముగ్గురిలో ఒకరిని స్థానికులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్నవారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇక సీసీ ఫుటేజీలో ఓ దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని తన్నుతున్నట్లు ఉంది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రంగంలోకి ‘బండి’
అమ్మవారి విగ్రహం ధ్వంసం విషయం తెలుసుకున్న బీజేపీ నేతలుల భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ, మాజీ మంత్రి తలసాన శ్రీనివాస్‌యాదవ్ కూడా ఆలయాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడారు. మత కలహాలను అడ్డుకోవాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ను కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మతవిద్వేషాలను ప్రోత్సహించే వారితో కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌ను బుక్ చేసిన సంజయ్..
ఇక ఆలయాన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కార్‌పై నిలప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మత ఘర్షణలు మొదలయ్యాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు దుర్గామాత నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు జరుపుకున్న ప్రజలు.. ఈ రోజు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడాన్ని సహించరని హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.