https://oktelugu.com/

Congress : టార్గెట్‌ ఫిక్స్‌.. రేసులోకి వస్తున్న కాంగ్రెస్‌!

ఇక మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోనూ రేవంత్‌ ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.ప్రచారంలో దూసుకుపోతున్న ఈటలకు రేవంత్‌ మూకుతాడు వేశారు. కమ్యూనిస్టు అని చెప్పుకునే ఈటల రాజేందర్‌ మతం ఎజెండాతో రాజకీయాలు చేసే వాళ్లతో చేతులేలా కలిపారని ప్రశ్నించారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2024 11:23 am
    Telangana Congress

    Telangana Congress

    Follow us on

    Congress : పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో టఫ్‌ ఫైట్‌ తప్పదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి డబుల్‌ డిజిట్‌ సీట్లపై కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కూడా 14 సీట్లు టార్గెట్‌ పెట్టుకుంది. ఇక పదేళ్లు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఈమేరకు మూడు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకోవడంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి.

    ప్లాన్‌ ప్రకారం ప్రసంగం..
    పార్లమెంటు ఎన్నికలు రేవంత్‌కు పరీక్షగా మారాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ వెనకబడిన నియోజకవర్గాల్లో దూకుడు ప్రసంగాలతో పార్టీని ఎన్నికల రేసులోకి తీసుకువస్తున్నారు. తాజాగా నిజామాబాద్, మల్కాజ్‌గిరి నియోజకవర్గ సభల్లో పాల్గొన్న రేవంత్‌ తన ప్రసంగంతో ప్రత్యర్థులకు చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రసంగించారు. జీవన్‌రెడ్డిని గెలిపిస్తే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని ఒప్పించి కేంద్ర మంత్రిగా చేసే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు. 2014, 2019లో నిజామాబాద్‌లో పసుపు రైతుల మద్దతుతో ఒకసారి కవిత, మరోసారి ధర్మపురి అర్వింద్‌ గెలిచారు. కానీ పసుపు బోర్డు విషయంలో ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. దీంతో జీవన్‌రెడ్డిని కేంద్ర వ్యవసాయ మంత్రిని చేస్తానని రేవంత్‌ ప్రకటించడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పటికే పసుపు బోర్డును ప్రకటించినందున.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దానిని ఏర్పాటు చేసి తమ ఖాతాలో వేసుకోవాలని రేవంత్‌ చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మూతబడిన చక్కర కర్మాగారం కూడా సెప్టెంబర్‌ 17లోగా తెరిపిస్తానని డెడ్‌లైన్‌ పెట్టి మరీ హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలతో నిజామాబాద్‌లో బీజేపీ దూకుడుకు చెక్‌ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    మల్కాజ్‌గిరిలో..
    ఇక మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోనూ రేవంత్‌ ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.ప్రచారంలో దూసుకుపోతున్న ఈటలకు రేవంత్‌ మూకుతాడు వేశారు. కమ్యూనిస్టు అని చెప్పుకునే ఈటల రాజేందర్‌ మతం ఎజెండాతో రాజకీయాలు చేసే వాళ్లతో చేతులేలా కలిపారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. రేవంత్‌ మాటలు ఈటలను ఇరకాటంలో పడేశాయని తెలుస్తోంది.

    వ్యూహాత్మకంగా ప్రచారం..
    సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కన్నా.. స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో తనదైన మార్క్‌ ప్రసంగంతో కేడర్‌లో, ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అంత ఈజీ కాదన్న వారు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ రేసులోకి వచ్చిందని అంటున్నారు.