Telugu student : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. ఒకవైపు అమెరికాలో. స్కాట్‌లాండ్‌లో.. మరోవైపు కెనడాలో.. తాజాగా కిర్గిజ్‌స్థాన్‌లో మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన హల్వా వ్యాపారి భీమరాజు రెండో కుమారుడైన దాసరి చందు(20) ఎంబీబీఎస్ చదివేందుకు ఏడాది క్రితం కిర్గిజ్‌స్థాన్ వెళ్లాడు. ఇటీవలే పరీక్షలు ముగియడంతో యూనివర్సిటీ అధికారులు ఆదివారం సమీపంలోని మంచు జలపాతం సందర్శనకు తీసుకెళ్లారు. ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు జలపాతంలో దిగారు. వారిలో చందు మంచులో కూరుకుపోయి మృతిచెందాడు. ఈమేరు అక్కడి అధికారులు సోమవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారని అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు.
అమెరికాలో మరణాలపై ఆందోళన..
గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 11 మంది విద్యార్థులు వేర్వేరు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా యావత్ భారత్ తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతోంది. నిజానికి మదన దేశం నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. ఇప్పుడు ఆ దేశం సురక్షితమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో ప్రవాస భారతీయులకు సంబంధించిన ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ షాకింగ్ విషయాలు వెల్లడిచింది. ఇలాంటి ఘటనలు జరుగకుండా అధికారులు, విశ్వవిద్యాలయాల సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరింది.
ఉన్న చదువులకు వెళ్లి..
ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులే ఎక్కువగా ఇటీవల మృత్యువాత పడుతున్నారు. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటికే మూడు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. కెనడాలో ఓ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. తాజాగా కిర్గిజ్‌స్థాన్‌లో మరో విద్యార్థి మృతిచెందాడు. ఉన్నత చదువులు పూర్తిచేసి ప్రయోజకులై వస్తారని తల్లిదండ్రులు అప్పులు చేసి విదేశాలకు పంపిస్తుంటే.. విధి వక్రించి అక్కడే మృతిచెందడం కన్నవారికి కడుపుకోత మిగులుస్తోంది.