Jeevan Reddy: ఇన్ని అవమానాలా.. కాంగ్రెస్‌ పార్టీ మమ్మల్ని చంపేసింది… భగ్గుమన్న జీవన్‌ రెడ్డి

కాంగ్రెస్‌ అంటేనే కయ్యాల పార్టీ.. అధికారంలోకి వచ్చాకా గొడవలు, గ్రూపులు ఉండవనుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే తెలంగాణ కాంగ్రెస్‌లో కయ్యాలు మొదలయ్యాయి. నేతలు సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 22, 2024 4:16 pm

Jeevan Reddy

Follow us on

Jeevan Reddy: కాంగ్రెస్‌ అంటేనే కయ్యాల పార్టీ. నేతల ఎదుగుదలను ఓర్వని పార్టీ. ఎదిగే వారిని వెనక్కు లాగే నేతలు ఉన్న పార్టీ. క్రమశిక్షణ లేని పార్టీ. అంతర్గత స్వాతంత్య్రం పేరుతో అధిష్టానంపై సైతం ఇష్టానుసారం మాట్లాడే పార్టీ. పదేళ్లు తెలంగాణలో అధికారానికి దూరంగా ఉన్న పార్టీ.. ఎట్టకేలకు 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ఉన్న వ్యతిరేకత, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అధిష్టానం ఇచ్చిన అనేక హామీలు చూసిన ప్రజలు అధికారం అప్పగించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచింది. ఇంతకాలం సాఫీగా సాగుతున్న పార్టీలో చిన్నచిన్న అలకలు, అంతర్గత కలహాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. పదవుల విషయంలో కొందరు అలకబూనుతుంటే.. కొందరు పార్టీలో ఆధిపత్యం కోసం గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. ఇక తాజాగా పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి మంగళవారం(అక్టోబర్‌ 22న) హత్యకు గురయ్యాడు. దీనిపై జీవన్‌రెడి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వం, పార్టీపైనే హాట్‌ కామెంట్స్‌ చేశారు. అక్కడు వెళ్లిన ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో మాట్లాడుతూ నీకో దండం.. నీ పార్టీకో దండం.. మమ్మల్ని కాంగ్రెస్‌ పార్టీ చంపేసింది. పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నా’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఏం జరిగిందంటే..
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై జగిత్యాల నుంచి పోటీ చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన డాక్టర్‌ సంజయ్‌ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో సంజయ్‌.. ఆరు నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి కండువా కప్పి సంజయ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి జీవన్‌రెడ్డి పార్టీపై అసంతృప్తితతో ఉన్నారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో అటు జీవన్‌రెడ్డి, ఇటు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో క్యాడర్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. మరోవైపు జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి మరో మూడు నెలల్లో పూర్తికానుంది. ఎమ్మెల్యేగా గెలిచినా, మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా మంత్రి అయ్యే అవకాశం ఉండేది. కానీ, ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎమ్మెల్సీగా మరో ఛాన్స్‌ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది కూడా జీవన్‌రెడ్డిలో అసంతృప్తిని పెంచుతోంది. దీంతో పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు.

ప్రధాన అనుచరుడి హత్య..
ఇదిలా ఉంటే… ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి మంగళవారం(అక్టోబర్‌ 22న) ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం మార్నింగ్‌ వాక్‌ చేసి తిరిగి వస్తున్న అతడిని హత్య చేశారు. కారుతో ఢీకొట్టి విచక్షణారహితంగా కత్తులతో దాడిచేశారు. ఈ దాడి చూసిన కొంతమంది గ్రామస్తులు వెంటనే గంగారెడ్డిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నంం చేశారు. మార్గం మధ్యలోనే గంగారెడ్డి మృతిచెందాడు.

హత్య వెనుక ఉన్నది ఎవరు?
జగిత్యాల జిల్లా జాబితాపూర్‌కు చెందిన గంగారెడ్డి మాజీ ఎంపీటీసీ. అనుచరుడి హత్యతో జీవన్‌రెడ్డి ఆందోళచెందారు. వెంటనే హత్యను ఖండిస్తూ ఆందోళన చేశారు గంగారెడ్డిని చంపింది బత్తిని సంతోష్‌గౌడ్‌ అనే వ్యక్తి అని ఆరోపించారు. గతంలో గంగారెడ్డిని చంపుతానని పలుమార్లు బెదిరించాడని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ హత్యేనని పేర్కొన్నారు. జీవన్‌రెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్‌ ఆందోళనలో పాల్గొన్నారు.