CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సెలబ్రెటీలు చాలా ఇబ్బంది పడుతున్నారట. ఇటీవల అల్లు అర్జున్ వ్యవహారంతో రాష్ట్రం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అల్లు అర్జున్ తన పుష్ప-2కు సంబంధించి ప్రమోషన్ కోసం సంధ్య థియేటర్ కు వెళ్లాడు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక యువతి మరణించగా.. ఆమె కొడుకు కూడా చావు వరకు వెళ్లాడు. దీంతో కొందరు సదరు థియేటర్ యాజమన్యంపై, సినిమా హీరో అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం (డిసెంబర్ 13) అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరు పరిచారు. కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయనను జైలు తరలించారు. ఇలా నాటకీయ పరిణామాల మధ్య రాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నాడు. దీనిపై ఆయన అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. సెలబ్రెటీలను టార్గెట్ గా రేవంత్ ప్రభుత్వం నడుపుతున్నారని మండిపడుతున్నారు.
హైడ్రా వచ్చీ రావడంతో ఎన్-కన్వెన్షన్ ను కూల్చివేసింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా.. ఎలాంటి హెచ్చరిక చేయకుండా నేలమట్టం చేసింది. ఈ విషయంలో నాగార్జున చాలా ఇబ్బంది పడ్డారు. తాను ఎటువంటి ఆక్రమణలను పాల్పడలేదని, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చేలోపే నేల మట్టం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేశారు సరే.. తను తప్పు చేసినట్లు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని ఆయన రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తో మారోసారి ప్రభుత్వ తీరుపై కొంత నిరసన వ్యక్తం అవుతుంది. నిన్న జరిగిన కొన్ని కార్యక్రమాల్లో రేవంత్ స్వయంగా మాట్లాడుతూ ఎవ్వరైనా చట్టానికి సమానమేనని చెప్పడం.. ఆయన స్టాండ్ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం అవుతుంది. ఇక ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నర్మగర్భంగా మాట్లాడడం చూస్తుంటే కావాలనే ఇది జరిగిందా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ కూడా ప్రభుత్వం స్టాండ్ బయటకు చెప్పద్దు అనడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక వేళ ఇది నిజంగా ప్రభుత్వం చేసినా తాము మాత్రం ఖండిస్తున్నామని ఆయన అన్నారు. జాతీయ స్థాయి నటుడు కాబట్టి ఆయన విషయంలో కాస్త ఆలోచించాల్సిన అనిచెప్పడం వెనుక ఏ పరమార్థం దాగుందో తెలుస్తుంది.
ఏది ఏమైనా అప్పుడు నాగార్జున, ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వంపై ఇండస్ట్రీ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.