Kaleshwaram Yatra: కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ఇప్పట్లో విడిచి పెట్టేలా కనిపించడం లేదు. ఇటీవల రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్ రెడ్డి వంటి వారు మేడిగడ్డ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, నీటి పారుదల శాఖలో నెలకొన్న పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేశారు. అధికారులతో కూడా నీటిపారుదల శాఖలో జరిగిన బాగోతాలను లెక్కలతో వివరించారు. శనివారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్డ్ బడ్జెట్ ప్రసంగంలో కూడా భట్టి విక్రమార్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పదే పదే ప్రస్తావించారు..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ఫిల్లర్స్ కుంగిపోవడం, ఇతర సమస్యల నేపథ్యంలో.. ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగించాలని నిర్ణయించింది. ముందుగా అనుకున్న సమయం ప్రకారం ఈనెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. శనివారం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సోమవారం మాత్రమే అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ ప్రాజెక్టు సందర్శనకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యతను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.. 13వ తారీఖున భారత రాష్ట్ర సమితి నల్లగొండ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తున్నారు. సభా వేదిక మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల మీద కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిన తీరును ఆయన ఎండగట్టనున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కి కౌంటర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం యాత్రకు శ్రీకారం చుట్టడం విశేషం. ప్రభుత్వం ఆహ్వానిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
కృష్ణా నది పై నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి బాధ్యతలను కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) కి అప్పగించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. న్యూ ఢిల్లీలో అధికారులతో సమావేశం కూడా నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వెళ్లారని.. ఇక ఆ ప్రాజెక్టులు అప్పగించడం మాత్రమే మిగిలి ఉందని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. తన అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు ప్రచురిస్తోంది. అసలే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల్లో సెంటిమెంట్ రగిలించాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. అయితే ఇది ఎక్కడ తమకు ప్రతిబంధకంగా మారుతుందోననే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. అందుకే ఆ పార్టీ నాయకులు భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అత్యంత తెలివిగా కాళేశ్వరం యాత్రకు శ్రీకారం చుట్టింది. 13వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ.. వాటిని 12వ తారీఖు వరకే పరిమితం చేసి.. 13న కాళేశ్వరం యాత్రకు వెళ్తోంది. యాత్రకు కేసీఆర్ ని కూడా ఆహ్వానించింది. మరి దీనికి ఆయన వెళ్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.