Telangana Assembly Elections: కేసీఆర్ వాడుకొని వదిలేస్తే.. కాంగ్రెస్ చెరో రెండు ఇచ్చింది

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్ల కసరత్తును వేగం చేసింది. సిపిఎం, సీపీఐ కి చెరో రెండు సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

Written By: Bhaskar, Updated On : October 10, 2023 11:57 am

Telangana Assembly Elections

Follow us on

Telangana Assembly Elections: మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం కేసీఆర్ కు అనివార్యం.. పైగా అప్పుడు భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తరఫున పోటీ చేయడం, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో భారత రాష్ట్ర సమితిలో ఒకింత ఆందోళన నెలకొంది. ఆ సమయంలో తను బరిలో నిలిపిన అభ్యర్థి విజయం సాధించాలి కాబట్టి.. కెసిఆర్ సరికొత్త రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. కమ్యూనిస్టు పార్టీలను చేరదీశారు. మునుగోడులో తోడ్పాటు అందించాలని కోరారు. కెసిఆర్ మాటే ఆయాచితవరం అనుకున్నారో తెలియదు గాని.. గులాబీ పార్టీ విజయానికి కృషి చేశారు. ఆ తర్వాత కెసిఆర్ వారిని దూరం పెట్టారు. అప్పట్లో మునుగోడు ఉప ఎన్నికలకు ముందు కొన్ని సీట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చి.. ఆ తర్వాత వారిని సంప్రదించకుండానే టికెట్లు కేటాయింపు జరిపారు. దీంతో సహజంగానే కమ్యూనిస్టులు నొచ్చుకున్నారు. కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. దీనికి కౌంటర్ గా నమస్తే తెలంగాణ కూడా ప్రతి ఆరోపణలు చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్ల కసరత్తును వేగం చేసింది. సిపిఎం, సీపీఐ కి చెరో రెండు సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సిపిఎం కు భద్రాచలం, మిర్యాల గూడ, సిపిఐ కి కొత్తగూడెం, మునుగోడు స్థానాలను కేటాయించింది. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొదెం వీరయ్య కొనసాగుతున్నారు. ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ స్థానం సిపిఎం కు కేటాయించడంతో.. వీరయ్య కు పినపాక సీటు ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక మిర్యాలగూడలో సిపిఎం సంస్థాగతంగా బలం ఉన్న నేపథ్యంలో ఆస్థానాన్ని ఆ పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక కొత్తగూడెం స్థానంలో మొన్నటిదాకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పొత్తుల్లో భాగంగా ఈ స్థానం సిపిఐ కి వెళ్లిపోవడంతో.. ఆయన ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో.. ఈసారి పోటీ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని సిపిఐ కి కేటాయించింది.

ఈ నాలుగు సీట్లు కేటాయించడం ద్వారా మిగతా ప్రాంతాల్లో కొద్దో గొప్పో ఉన్న కమ్యూనిస్టు ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాల ఓట్ల ద్వారానే భారత రాష్ట్ర సమితి విజయం సాధించిందని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉంటుంది కనుక.. కమ్యూనిస్టు ఓట్లు తమకు కీలకంగా మారుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే కమ్యూనిస్టులు అడిగిన అన్ని స్థానాలు కాకుండా.. వారికి పట్టు ఉ న్న ప్రాంతాలను ఇచ్చేసింది. అయితే సీట్ల పంపకానికి సంబంధించి అంగీకారం త్వరలో ఆమోదముద్రకు నోచుకుంటుందని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు చెబుతున్నారు. గత సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పొత్తుకు సంబంధించి త్వరగానే ఒక అభిప్రాయానికి రావడం పట్ల ఇరు పార్టీలకు చెందిన నాయకుల్లో ఆత్మవిశ్వాసం ఉరకలు వేస్తోంది.