Cold Wave: తెలంగాణలో చలి చంపేస్తోంది.. ఎందుకీ పరిస్థితి?

మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Written By: Raj Shekar, Updated On : December 23, 2023 11:24 am

Cold Wave

Follow us on

Cold Wave: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదవుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోద అవుతున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తుపాను కారణంగా ఉష్ణాగ్రతలు సాధారణంగానే నమోదయ్యాయి. తాజాగా చలి పంజా విసురుతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 6.8 డిగ్రీ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డిలో 7.2, సంగారెడ్డిలో 7.3, సిద్దిపేటలో 8.2, ఆదిలాబాద్‌లో 8.5, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నిర్మల్‌లో 8.6, మెదక్‌లో 8.7, వికారాబాద్‌లో 8.9, కామారెడ్డి, సిరిసిల్లలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సాధారణం కన్నా తక్కువగా..
మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు న్యూమోనియా, ఇతర శ్వాససంబంధిత జబ్బులబారిన పడుతున్నారు. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి.

ఇంకా తగ్గే ఛాన్స్‌..
ఇదిలా ఉండగా, వచ్చే రెండు రోజుల్లో కూడా తెలంగాణ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట బయటకు తిరుగొద్దని చెబుతున్నారు. అత్యవసర పని ఉంటే చెవులు కవర్‌ అయ్యేలా క్యాప్‌ పెట్టుకోవాలని.. అలాగే స్వెట్టర్‌ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.