Belt Shops Liquor: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై మొదట దృష్టిపెట్టింది. ప్రజలకు ఇబ్బందిగా మారిన గత పాలకుల నిర్ణయాలను సరిచేయడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా భాగంగా పేద, మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిన బెల్టు షాపులపై దృష్టిపెట్టారు. అడ్డగోలుగా వెలసిన బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీకం ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు.
విచ్చల విడిగా బెల్టు షాపులు..
తెలంగాణలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్టు షాపులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో గ్రామంలో 6 నుంచి 12 బెల్ట్‌షాపులు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో 12 వేల గ్రామాల్లో లక్ష వరకు బెల్టు షాపులు ఉన్నట్లు సమాచారం. బెల్టు షాపుల వల్ల తాగుడుకు బానిసలయ్యే వారి సంఖ్య భారీగా పెరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, బెల్టు షాపుల మూసివేతను నిబద్ధతతో అమలుపరుస్తే లక్షలాది కుటుంబాలకు కొద్దిపాటి మేలు జరిగే అవకాశం ఉందని రేవంత్ ప్రభుత్వం యోచిస్తుంది.
నిర్వాహకులపై క్రిమినల్ కేసులు..
గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్‌షాపుల యజమానులను మొదట హెచ్చరించాలని, అయినా ఖాతరు చేయకుండా షాపులు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈమేరకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది.
గతంలో జోరుగా విక్రాయలు..
గత ప్రభుత్వంలో తెలంగాణలో బెల్టు షాపులు యథేచ్ఛగా పెరిగాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా బెల్టు షాపు యజమానుదారులు స్థానికంగా ఉన్న వైన్స్ దుకాణాల నుంచి ∙కొనుగోలు చేసిన మద్యాన్ని అధిక ధరలకు అమ్మారు. దీంతో మద్యం ఏరులై పారింది. మహిళలు అనేకసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ బెల్టు దందాపై దృష్టిపెట్టారు.