HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదా?

CM Revanth Reddy: రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదా?

CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కెసిఆర్ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ దీటుగా సమాధానం చెబుతోంది. ఇటీవల కేసీఆర్ నల్లగొండ సభ నిర్వహిస్తే.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ యాత్ర నిర్వహించారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీరును కేసీఆర్ ఎండగడితే.. మేడిగడ్డ ఫిల్లర్ల కుంగుబాటుపై రేవంత్ రెడ్డి కెసిఆర్ తీరును ప్రశ్నించారు. ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఇమేజ్ కు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీపై తొలి రోజు నుంచే భారత రాష్ట్ర సమితి ఎదురు దాడి మొదలు పెట్టింది. పక్కలో బల్లెం లాగా ప్రతి విషయంలోనూ ప్రశ్నిస్తోంది. దీనికి బీఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా విభాగం తోడు కావడంతో కాంగ్రెస్ పార్టీకి గెలిచిన ఆనందం ఏమాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఇందులో 10 మందిని తమ వైపు తిప్పేసుకుంటే.. రాజకీయం రసవత్తరంగా మారుతుందని భారత రాష్ట్ర సమితి అంచనా వేస్తోంది. అందువల్లే ఈ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదని భారత రాష్ట్ర సమితి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పలుమార్లు కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

కెసిఆర్ పార్టీ పరంగా ఓడిపోయినప్పటికీ.. ఆయన ఇమేజ్ తెలంగాణ రాష్ట్రంలో చెక్కుచెదరలేదు. అందువల్లే ఆయన ప్రతిసారీ “కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని” అంటున్నారు. ఈ ఇమేజ్ ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఏ క్షణమైనా.. ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురైనా తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి అవసరం. అలాంటి శక్తి సంపాదించాలంటే.. ఐదేళ్లపాటు ప్రభుత్వం సాఫీగా నడవాలంటే కాంగ్రెస్ పార్టీ బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవాలి. అన్నింటికీ మించి కారు పార్టీకి కర్త, కర్మ, క్రియ అయినట కెసిఆర్ ను బలహీనపరచాల్సి ఉంటుంది. అందువల్లే కాంగ్రెస్ పార్టీ వరుసగా గత ప్రభుత్వ తప్పిదాలను ఏ కరువు పెడుతోంది. వీటివల్ల కెసిఆర్ ఇమేజ్ ను ప్రజల్లో చులకన చేస్తున్నది. కెసిఆర్ ఇమేజ్ పై ఆధారపడిన భారత రాష్ట్ర సమితి పరపతిని ప్రజల్లో తగ్గిస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు దీనిని మరింత తగ్గిస్తే ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ ఉండదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు..

వివిధ నివేదికల ప్రకారం.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే కెసిఆర్ ప్రభుత్వం ఓడిపోయేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేసే కంటే.. ఆయన పాలనలో తీసుకొన్న నిర్ణయాలు, చేపట్టిన పనులలో అసలు విషయాలను బయట పెడుతున్నారు. అవినీతి జరిగిందని, అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారం చేస్తున్నారు. ఇది గనుక విజయవంతం అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు భారత రాష్ట్ర సమితి నుంచి పెద్దగా ఇబ్బంది ఉండదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి పది పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామనే ధీమా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ఎలాగూ భారత రాష్ట్ర సమితిని సైడ్ తప్పిస్తే.. బిజెపితోనే కాంగ్రెస్ పార్టీ పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడు తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణ తెరపైకి వస్తుంది. బిజెపికి నాలుగు లేదా ఐదు స్థానాలు వస్తాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపించి.. అధిష్టానం ఎదుట మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular