HomeతెలంగాణCM Revanth Reddy: నిన్న రాధాకృష్ణ.. నేడు రామోజీరావు.. రేవంత్ ఎత్తుగడలు అవేనా

CM Revanth Reddy: నిన్న రాధాకృష్ణ.. నేడు రామోజీరావు.. రేవంత్ ఎత్తుగడలు అవేనా

CM Revanth Reddy: బలమైన నాయకుడు కావాలి అంటే.. దానికి బలమైన మీడియా అండ కావాలి. అలా ఉంటేనే జనం నోళ్ళల్లో నానుతారు. దీనిని నరేంద్ర మోడీ నిరూపిస్తే.. కెసిఆర్ పదేళ్ల కాలంలో చేసి చూపించారు. ఇక చంద్రబాబు లాంటి నాయకుడికి మొదటి నుంచి ఓ వర్గం మీడియా అండ ఉండనే ఉంది. అందువల్లే ఆయన అధికారానికి దూరమైనప్పటికీ జనం నోళ్లల్లో నానుతున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన బలమైన కేసీఆర్ పార్టీ మీద విజయం సాధించారు. గొప్ప మెజారిటీ కాకపోయినప్పటికీ.. కెసిఆర్ లాంటి రాజకీయ చాణక్యుడిపై విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ.. జనాలను తన వైపు మళ్లించుకోవడంలో రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారు. అయితే దీని వెనక ఒక బలమైన మీడియా, మరీ ముఖ్యంగా ఓ వర్గం మీడియా కీలకపాత్ర పోషించింది. అందువల్లే రేవంత్ రెడ్డి జనాలకు ఈజీగా కనెక్ట్ కాగలిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అదే తీరు కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో రకరకాల విమర్శలు వినిపించినప్పటికీ రేవంత్ రెడ్డి తన దారిలో తను వెళ్తున్నారు.

ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఇంటర్వ్యూ మీకే ఇస్తానని రాధాకృష్ణకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ద్వారా పలు సంకేతాలను అటు జాతీయస్థాయి నాయకులకు, ఇటు రాష్ట్ర స్థాయి నాయకులకు పంపారు. అనంతరం తన పాలనలో తను బిజీగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు అది కూడా నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్న వేళ.. రేవంత్ రెడ్డి అనూహ్యంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ పర్యటనకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి ఈమధ్య రామోజీరావు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఆయన మానస పుత్రిక మార్గదర్శి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అప్పట్లో మార్గదర్శి కేసు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంప్లీడ్ కాలేదు. అరెస్ట్ చేద్దామని చెప్పినప్పటికీ “వద్దూ ఆయనకు క్యాన్సర్ అరెస్టు చేయడం కుదరదని” కెసిఆర్ జగన్ ను అడ్డుకున్నారట. ఇక ఇప్పుడు ఆ మార్గదర్శి కేసులో రేవంత్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదు. ఇంప్లిడ్ అయ్యే అవకాశం దక్కినా దానికి రేవంత్ ఒప్పుకోడు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈనాడు తనకు ఏ స్థాయిలో సపోర్ట్ చేసిందో మర్చిపోయే రకం కాదు అతడు. అలా కృతజ్ఞత చెప్పడానికో, పార్లమెంటు ఎన్నికల్లో సహకరించాలని కోరాడానికో.. మరింకేం కారణమో తెలియదు గాని.. రేవంత్ రెడ్డి రామోజీరావు దగ్గరికి వచ్చాడు. సహజంగానే తన వద్దకు ఎవరైనా వస్తే కనకపు సింహాసనంలో కూర్చుని.. వచ్చిన అతిధిని ఎదురుగా కూర్చోబెడతాడు రామోజీరావు. కానీ ఈసారి అలాంటి సీన్ కనిపించలేదు. కనకపు సింహాసనంలో అటు రేవంత్, ఇటు కిరణ్ కుర్చుని ఉండగా.. మధ్యలో ఒక మామూలు కుర్చీలో రామోజీరావు ఆసీనుడయ్యాడు. ఎప్పుడు నీట్ షేవ్ తో కనిపించే రామోజీరావు.. కొంచెం గడ్డం, కొంచెం మీసాలతో దర్శనమిచ్చాడు. ఇంతకీ వారి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుంది? దేని గురించి మాట్లాడుకుని ఉంటారు? ఇవన్నీ రామోజీరావు చెప్పడు. రేవంత్ రెడ్డి విప్పడు.. ఎలాగూ మర్యాదపూర్వక భేటీ అని రేపు పొద్దున ఈనాడు రాస్తుంది. ఆంధ్రజ్యోతి కూడా అవసరం కాబట్టి అచ్చేస్తుంది. ఇది సాక్షికి సంబంధం లేని మ్యాటర్.. నమస్తే తెలంగాణకు ఇష్టం లేని విషయం.. అయితే దీని వెనుక ఏమైనా లొసుగులు ఉంటే మాత్రం జగన్ పత్రికలో చూడొచ్చు.. అయినా ఊరకనే రారు మహానుభావులు అన్నట్టు.. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పత్రిక అధిపతిని కలవడం అంటే దాని వెనుక ఎన్నో ఉంటాయి. అన్నట్టు త్వరలో రేవంత్ రెడ్డి టీవీ 5 బీఆర్ నాయుడి ని కూడా కలుస్తాడని ప్రచారం జరుగుతుంది. అంటే చంద్రబాబు అనుకూల మీడియాను మొత్తం తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో రేవంత్ పడ్డాడా ఏంటి?! అలాంటప్పుడు ఎన్ టీవీ, టీవీ9 ఏం పాపం చేశాయ్?!

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version