CM Revanth Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజులే సమయం ఉంది. ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనుంది. చివరిరోజు బహిరంగ సభలు, రోడ్‌షోలతో హోరెత్తించే పనుల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక 17 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలతో తేనెతుట్టెను కదిపారు.
సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానాలు..
హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం(మే 10న) సాయంత్రం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ ఎన్నికలు, ఆ రాష్ట్ర సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో ఉన్న సంబంధాల గురించి మాట్లాడారు. ఆ రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం పుల్వామా దాడి అంశాన్ని ప్రస్తావించారు. ఐదేళ్ల క్రితం 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపుర వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ దాడి, అంతకు ముందు పాకిస్తాన్‌పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై రేవంత్ అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ఇంటలిజెన్స్ వైఫల్యంతోనే పుల్వామా దాడి జరిగిందని ఆరోపించారు.
అంతర్గత భద్రతలో లోపాలు..
దేశ అంతర్గత భద్రత వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ వైఫల్యం ఎంత ప్రమాదకారిగా మారిందనడానికి పుల్వామా ఉగ్రదాడి ఓ నిదర్శనమని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో నడి రోడ్డుపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడిని ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందని ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధి కోసమే సర్జికల్ స్ట్రైక్స్..
ఇక 2019లో భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శంకించారు. ప్రధాని నరేంద్రమోదీ తన రాజకీయ లబ్ధికోసమే దీనిని నిర్వహించారని ఆరోపించారు. పుల్వామా దాడిని ఎందుకు జరుగనిచ్చారని ప్రశ్నించారు. ఇంటలిజెన్స్ బ్యూరో, రా వంటి సంస్థలను మోదీ సరిగా వినియోగించుకోవడం లేదని ఆరోపించారు. పుల్వామా దాడి ముమ్మాటికీ మోదీ ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. ఇక పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో లేదో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు.