CM Revanth Reddy Vice Presidential Election: ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనతో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ వ్యక్తి అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్‌లో తన మాటకు విలువ లేదని ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేసినా.. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రతిపాదించి ఆమోదం తెచ్చుకోవడం ద్వారా రేవంత్ తన ప్రభావాన్ని చాటుకున్నాడు.
Also Read: తెలంగాణ పోలీస్ శాఖలోకి ప్రైవేట్ వ్యక్తి.. బదిలీలు, పదోన్నతులు, సెటిల్మెంట్లు
ఇండియా vs NDA: దక్షిణాది అభ్యర్థుల పోరు
ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను ఖరారు చేసింది. ఇది లాంఛనమేనని భావించిన సమయంలో ఇండియా కూటమి నుంచి తెలంగాణ అభ్యర్థి బరిలోకి రావడం పోరును రసవత్తరంగా మార్చింది. మొదట్లో డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి రవిని ఇండియా కూటమి పరిగణనలోకి తీసుకుందనే వార్తలు వచ్చినా, చివరికి రాజకీయ అనుబంధాలు లేని న్యాయవేత్త జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం నిజమైన ట్విస్ట్‌గా మారింది.
– జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయం
2007 నుండి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి, గోవా లోకాయుక్త తొలి చైర్మన్‌గా కూడా సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వ కేంద్రం శాశ్వత ట్రస్టీగా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం ఆయన స్వగ్రామం. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ న్యాయవాదిగా, హైకోర్టు న్యాయమూర్తిగా, అనంతరం సుప్రీంకోర్టు జడ్జిగా తన ప్రతిభను చాటుకున్నారు.
– వివాదాస్పద తీర్పులు – ప్రజా ఉద్యమాల్లో పాత్ర
రాజ్యాంగ సమస్యలపై సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నల్లధనం కేసులపై ఆయన తీర్పులు దుమారం రేపాయి. ఛత్తీస్‌ఘడ్‌లో ట్రైబల్స్ తో ఏర్పాటైన సల్వాజుడుం దళాలపై ఆయన ఘాటైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మానవ హక్కుల కోసం తన స్వరాన్ని వినిపిస్తూ, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు.
– రాబోయే ఎన్నికల్లో సమీకరణాలు
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు తప్పనిసరిగా పోటీగా మారింది. రెండు కూటములు దక్షిణాది అభ్యర్థులను ఎంపిక చేయడం గమనార్హం. బిజెపి అభ్యర్థి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మధ్య జరిగే ఈ పోరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ “మానవ హక్కుల నేత vs బిజెపి” అని వ్యాఖ్యానించారు.
గెలుపు ఓటమి ఏదైనా, ఇండియా కూటమి కనీసం పోరును లాంఛనమయంగా వదిలిపెట్టే పరిస్థితి లేదని ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఇప్పుడు వైసీపీ ఏ వైపు నిలబడుతుందన్నది కీలకం. బిజెపి వైపు మొగ్గు చూపుతుందా లేక తెలుగు తేజం సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తుందా అనేది రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయనుంది.