Ande Sri Funeral: ముఖ్యమంత్రి అయినంత మాత్రాన దర్బార్లో ఉండాల్సిన అవసరం లేదు. రాజమహల్ లో సకల సౌకర్యాలు అనుభవించాల్సిన పనిలేదు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచాడు కాబట్టి.. ప్రజలకు అందుబాటులో ఉంటే సరిపోతుంది. కష్టాలను, కన్నీళ్లు తుడిచి నేను ఉన్నానని భరోసా ఇస్తే ఆ నాయకుడిని పదికాలాలపాటు ప్రజలు కంటికి రెప్పలా చూసుకుంటారు.. నవీన్ పట్నాయక్, మనోహర్ పారికర్, బుద్ధదేవ్ భట్టాచార్య.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది.. వాస్తవానికి ముఖ్యమంత్రి పీఠం అనేది అత్యంత సవాళ్లతో కూడుకున్న స్థానం. అటువంటి స్థానానికి చాలామంది వన్నె తీసుకొచ్చారు.. తన పాలనదక్షతో.. అద్భుతమైన వ్యవహార శైలితో ఆకట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే కొంతమంది ముఖ్యమంత్రి గొప్ప పరిపాలన అందించి ప్రజల మన్నన పొందారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనతను కేసీఆర్ పొందారు. కెసిఆర్ రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఉద్యమ సమయంలో ఆయన ఎటువంటి ధోరణి అయితే అవలంబించారో… ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుమించి అనే స్థాయిలో ప్రజలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రగతిభవన్ లేదా వ్యవసాయ క్షేత్రంలో ఉండేవారు. ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు. కొన్ని సందర్భాలలో సొంత మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు. అప్పట్లో హోం శాఖ మంత్రి మహమూద్ ఆలిని కూడా ఆయన ఫామ్ హౌస్ గేట్ నుంచి బయటికి పంపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ పరిపాలన కాలంలో జరిగిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. అందువల్లే తెలంగాణ ప్రజలు మూడోసారి కెసిఆర్ నాయకత్వాన్ని నమ్మలేదు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా గుండు సున్నా ఇచ్చారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలకు దూరంగా ఉన్న విధానం.. ఇతర వ్యవహారాలను పరిశీలించిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సాధ్యమైనంతవరకు ప్రజలకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. హంగు ఆర్భాటాలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు. తాజాగా ప్రజా కవి అందెశ్రీ చనిపోతే.. ఆయన పాడెను మోశారు. అంత్యక్రియల ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన అక్కడే ఉన్నారు. అంతేకాదు అందెశ్రీ భార్యను ఓదార్చి అనునయించారు. తాను అండగా ఉంటానని ఆమెకు భరోసా ధైర్యం కల్పించారు. రేవంత్ చేసిన పని చివరికి గులాబీ పార్టీ నేతలకు కూడా నచ్చింది. బిజెపి నాయకులు కూడా రేవంత్ చేసిన పని పట్ల అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పరిపాలనపరంగా.. విలేకరుల సమావేశాల్లో మాట్లాడే మాటలపరంగా రేవంత్ రెడ్డి కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఆయన ప్రత్యర్థులకు కూడా నచ్చుతాడు. మంగళవారం చేసిన పని కూడా అటువంటిదే.