CM Revanth Reddy : తెలంగాణలో పదేళ్లుగా బదిలీలు, పదోన్నతుకు నోచుకోని ఉపాధ్యాయుల సమస్యను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనూ పూర్తిచేసి విపక్షాలకు, ముఖ్యంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌క పార్టీకి షాక్ ఇచ్చారు. తరచూ కోర్టు కేసులతో ఆటంకం కలుగుతున్న పదోన్నతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పదోన్నతి పొందిన రాష్ట్రంలోని 30 వేల మంది ఉపాధ్యాయులతో శుక్రవారం(ఆగస్టు 2న)న హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన ఉపాధ్యాయులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘టీచర్లే రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రకటించారు. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల వ్యవహారంలో తనను చాలామంది భయపెట్టారని, ఉపాధ్యాయులు తేనెటీగల లాంటి వారిని, ఏదైనా తేడా వస్తే తేనె తుట్టెను కదిలించినట్టేనని చెప్పారని పేర్కొన్నారు. కానీ, స్వార్థం లేని ఉపాధ్యాయులే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. నమ్మించి మోసం చేసే ఉద్దేశం అసలే లేదని అందుకే పదోన్నతుల విషయంలో నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తెలంగాణలో ప్రజలు దొరల గడీలలో బందీ కాకూడదని పేర్కొన్న రేవంత్ రెడ్డి పేదరికం నుంచి విముక్తి కలగాలంటే చదువే మార్గమన్నారు. పేద పిల్లలకు అంకితభావంతో చదువు చెప్పే బాధ్యత మీదేనని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.
ఏం కావాలో నన్ను అడగండి..
ఇక ఇదే వేదికగా ఉపాధ్యాయులకు రేవంత్‌రెడ్డి సూచనలు కూడా చేశారు. మీకు ఏం కావాలన్నా.. తనను అడగాలని సూచించారు. బాధ్యత తానే తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నిలబడింది అన్నా, రేపు మళ్లీ గెలవాలి అన్నా ఉపాధ్యాయుల సహకారం ఉండాలని పేర్కొన్నారు. అందుకే మీకు ఏం కావాలన్నా చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ మూడుసార్లు అధికారంలోకి రావడానికి పేద, బస్తీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే కారణమని పేర్కొన్నారు. మరోసారి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉండాలంటే ఇక్కడ చదువులు బాగుండాలన్నారు. ఇందుకు ఉపాధ్యాయులే కీలకమని పేర్కొన్నారు.
మీ సహకారంతోనే ప్రభుత్వం..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయులు శాయశక్తులా కృషి చేశారని తెలిపారు. దాని ఫలితంగానే ఉపాధ్యాయులు సమస్యలు తీర్చి, పదోన్నతులు, బదిలీలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడాలని భావించామని, అందుకే బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించామని పేర్కొన్నారు. అయితే ఇతర హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో చివరకు 7.3% నిధులను అంటే 21 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చామని తెలిపారు.
స్ఫూర్తి నింపుకుని వెళ్లండి..
ఇక తాను సర్కార్ బడిలో చదువుకుని సీఎం అయ్యానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రజలు పిల్లలను పంపించేలాగా విద్యా వ్యవస్థ మారాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాలనలో జరిగింది ఏమిటో మీకు తెలియనిది కాదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి అందరూ స్ఫూర్తి నింపుకుని వెళ్లాలన్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్యలో పెంచడంతోపాటు, పిల్లలను, బడులను తీర్చిదిద్దుదామని ప్రతిజ్ఞ చేద్దాం సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నిలబెట్టేది.. పడగొట్టేది వారే..
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతోంది. ఎన్నికల విధుల్లో కీలకంగా వ్యవహరించేది ఉపాధ్యాయులే. ఏ ప్రభుత్వం ఏర్పడాలనేది వారే డిసైడ్ చేస్తారు. అందుకే రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయుల సహకారంతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించినట్లు పేర్కొంటున్నారు. ఏ ప్రభుత్వాన్ని అయినా పడగొట్టే, నిలబెట్టే సత్తా ఉపాధ్యాయులకు ఉంటుందని, అందుకే ఉపాధ్యాయులానే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.