CM Revanth: రేవంత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ప్రజలు నమ్మారు. అంతకుముందు పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పరిపాలన కాలంలో పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణ ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీపై సహజంగానే ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెట్టించిన ఆనందంలో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈ వంద రోజుల్లో ఆయన ఎన్ని హామీలు అమలు చేశారు?, ప్రజల మనోగతం ఎలా ఉంది? వీటిపై ప్రత్యేక కథనం.
ఆరోగ్యశ్రీ ఫైల్ పై..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆరోగ్యశ్రీ(Arogya Sri) కింద పదిలక్షల దాకా చికిత్సను అందించే ఫైల్ పై రేవంత్ తొలి సంతకం చేశారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చినట్టుగానే ప్రగతి భవన్ (pragathi bhavan) ముందు ఉన్న కంచెను తొలగించారు. ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. “విధ్వంసానికి గురైన ఒక్కో వ్యవస్థను రేవంత్ చక్క దిద్దుతున్నారు. మొదటి వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశారు. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన సభల్లో ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించాం. అర్హులకు పథకాలు అందజేశాం. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించాం. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ పథకాలపై విచారణకు అధికారులను ఆదేశించాం. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీ, మిషన్ భగీరథ పనులపై విచారణ చేపట్టాం. కమర్షియల్ టాక్స్ పరిధిలో 100 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేత పై విచారణకు ఆదేశించాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి అధికారుల పాత్రను వెలికి తీశాం. వారంలో రెండు రోజులపాటు ప్రజల సమస్యలను నివేదించుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చామని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఉద్యోగాల భర్తీ
అధికారంలోకి రాగానే కేవలం మూడు నెలల్లోనే 29వేల 384 ఉద్యోగాలను భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు అందించామని చెబుతోంది. వీరిలో 53% పురుషులు, 47 శాతం మహిళలు ఉన్నట్టు ప్రభుత్వం వివరిస్తోంది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీల పరిధిలో ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలు కల్పించామని ప్రభుత్వం వివరిస్తోంది. “గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాల నిలిపివేతలు, కోర్టు కేసులను ప్రస్తుత ప్రభుత్వం అధిగమించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. కొత్త పాలకవర్గాన్ని నియమించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. కొత్త పోస్టులు చేర్చి 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ జారీ అయింది.11, 062 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా డీఎస్సీ ప్రకటించిందని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
శ్వేత పత్రాలు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసింది.. విద్యుత్ రంగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రాలు విడుదల చేసింది.. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటిదాకా 23 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణించారని ప్రభుత్వం చెబుతోంది. ఇదే పథకం కింద 500 కు గ్యాస్ సిలిండర్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కుటుంబాలకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకాన్ని మార్చి ఒకటి నుంచి ప్రారంభించింది. సుమారు 40 లక్షల కుటుంబాలకు జీరో బిల్లు జారీ చేసింది. 22,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 4,50,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసింది.
పథకాలు మాత్రమే కాకుండా..
సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రక్షణ శాఖ భూముల సమస్యకు పరిష్కారాన్ని సాధించడం. హైదరాబాద్- రామగుండం రాజీవ్ రహదారిపై 2,232 కోట్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు జాతీయ రహదారి 44 పై 1580 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం.. 2,700 కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటిఐ ల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు. వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వంద రోజుల్లో ప్రజా పాలన దిశగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అడుగులు వేస్తోందని వారు అంటున్నారు.