Chiranjeevi- Garikapati Controversy: కోట్లాది మంది అభిమానం మెగాస్టార్ చిరంజీవి సొంతం. నటుడిగా, సేవాతత్పరుడు, సినీరంగం పెద్దగా చిరుకు అభిమాన గణం ఎక్కువ. వెండితెరపై నటిస్తున్న చాలామంది హీరోలు, హీరొయిన్లు కూడా చిరంజీవికి అభిమానపాత్రులే. పొలిటికల్ వాసన ఉన్నా..ఆ కుటుంబంలో వ్యక్తి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నా…చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు నిర్వహించారంటే చిరంజీవి వ్యక్తిత్వాన్ని, ఆయనకున్న పరపతిని తెలియజేస్తోంది. తాము నటించిన సినిమాల ఆడియో ఫంక్షన్లకు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు చిరంజీవి ఎప్పుడు వస్తారా? అని వర్ధమాన నటులు ఎదురుచూస్తున్న రోజులివి. సహజంగా చిరంజీవి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ సందడే వేరు మూడేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల పండుటాకుల వరకూ చిరంజీవితో చేయి కలపాలని ప్రయత్నిస్తారు. అయితే అదంతా సినిమా అభిమానమే కాదు. చిరంజీవి అనే వ్యక్తికి లభించే అరుదైన గౌరవం. అటువంటిదే చిరంజీవి అలయ్..బలయ్ లో చోటుచేసుకుంది. అభిమానులు చిరంజీవిని చుట్టముట్టడం.. ప్రవచనకర్త గరికిపాటి అలకపాన్పు హెచ్చరికలు జారీచేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. చిరంజీవి అభిమానులు రియాక్టు కావడం, అటు బ్రాహ్మణ సంఘాలు స్పందించడం వివాదం ముదురుతోంది.

వాస్తవానికి ఇదో సున్నితమైన అంశం. గరికిపాటి తన అవధానం ప్రారంభించేసరికి మరోవైపు చిరంజీవితో అభిమానులు ఫొటోలు దిగుతున్నారు. ఇది కొంచెం ఇబ్బంది కలిగించింది. దీంతో గరికిపాటి అసహనానికి గురయ్యారు. మీరు ఫొటో సెషన్ ఆపకపోతే నేను కార్యక్రమం నుంచి వెళ్లిపోతాను అంటూ అలక హెచ్చరికలు చేశారు. ఆయన్ను అక్కడున్న వారు సముదాయిస్తే కానీ శాంతించలేదు. ఇబ్బందిని గమనించిన చిరంజీవి ఫొటో సెషన్ నిలిపివేసి .. గరికిపాటి పక్కకు వచ్చి కూర్చున్నారు. ఆ తరువాత గరికిపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగలేదు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు రియాక్టు అయ్యారు. ట్విట్టర్ లోస్పందించారు. గరికిపాటికి కౌంటర్ ఇచ్చారు. చిరంజీవిని చూస్తే ఏపాటి వాడికైనా ఈపాటి అసూయ ఉంటుందని కామెంట్స్ చేశారు.
అయితే అక్కడ నుంచి మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. చిరంజీవికి గరికిపాటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై బ్రహ్మణ సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. సినిమాల పేరుతో వ్యాపారం చేసుకునేవాడికి.. ప్రవచనాలు చెప్పే పండితుడికి పోలిక ఏమిటని? ప్రశ్నిస్తున్నాయి. వివాదాన్ని మరింత జఠిలం చేశాయి. వాస్తవానికి ఇదో సున్నితమైన అంశం. అలయ్ బలయ్ అంటేనే అందరితో కలిసిపోవడం. చిరంజీవిలాంటి వ్యక్తి వస్తే అభిమానులు ఆ మాత్రం ఎగబడతారు. ఆ సమయంలో గరికిపాటి చమత్కారంగా వ్యవహరించాల్సి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. చిరంజీవిగారిని ప్రశాంతంగా విడిచిపెట్టండి. ఫొటో సెషన్ ఆపండి అని ఉంటే ఏ సమస్యా వచ్చి ఉండేది కాదు. కానీ గరికిపాటి నేరుగా చిరంజీవిగారిని తప్పు పడుతూ మాట్లాడమే వివాదానికి కారణమైంది.

అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తించుకోవాల్సి ఉంది. ఈ ఘటనకు ముందు చిరంజీవి తన ప్రసంగంలో గరికిపాటిని ఎంతో గౌరవిస్తూ మాట్లాడారు. గరికిపాటి ప్రవచనం అంటే తనకు చాలా ఇష్టమని.. తనను ఇంటికి తీసుకెళ్లి గౌరవించాలని ఉందని హృదయపూర్వకంగా మాట్లాడారు. తన మనసులో గరికిపాటిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాంటి వ్యక్తి పట్ల గరికిపాటి చూపించిన అసహనం పై అక్కడున్న వారు సైతం బాధపడ్డారు. వాస్తవానికి చిరంజీవి కంటే గరికిపాటి చిన్నవారు. అయినా గరికపాటిని సన్మానించి ఆత్మీయతను పంచుకున్నారు. కానీ గరికిపాటి చేసిన అసహనం వ్యాఖ్యలు సమంజసంగా లేవు. నేను వెళ్లిపోతానంటూ వ్యాఖ్యానించడం సరిగా లేదు. వేదికలపై ఉండే పెద్దమనిషిలా వ్యవహరించలేదని అక్కడున్న వారే చెబుతున్నారు. అయినా అన్నీ తెలిసిన వారు కూడా దీనిని రభస చేస్తున్నారు. అటు మెగా ఫ్యాన్స్ కూడా చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వివాదాన్ని పెంట చేయకుండా ఉండాల్సిన బాధ్యత వారిపై ఉంది. లేదంటే ఇద్దరు వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చిన వారవుతారు.