Kavitha Chintamadaka Village: ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అంటారు. తెలంగాణ సమాజం ఈ సామెతను బలంగా నమ్ముతుంది. ఆడబిడ్డను సాక్షాత్తు ఇంటి దేవతగా కొలుస్తూ ఉంటుంది. ప్రతి పండుగకు చీరె సారే పెడుతూ గౌరవించుకుంటుంది. దీనికి ఏ కుటుంబం కూడా మినహాయింపు కాదు. తెలంగాణ అంటేనే ఒక బలమైన ఆస్తిత్వానికి ప్రతీక. అందువల్లే ఇక్కడ చాలా దృఢమైన ఉద్యమాలు పుట్టాయి. ఆ ఉద్యమాలలో ఆడవారి పాత్రను బలంగా నిలుపుకున్నాయి. సమ్మక్క సారలమ్మ.. రుద్రమదేవి.. చాకలి ఐలమ్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే వీరవనితలు.. ధీర వనితలు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పటికీ కూడా ప్రజల మదిలో మెదులుతున్నారు. తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ వనితలను మననం చేసుకుంటూ ముందుకు సాగింది. తమ స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ అడుగులు వేసింది. అలా అడుగులు వేసిన వారిలో కల్వకుంట్ల కవిత కూడా ఒకరు.
Also Read: మోదీ తల్లితో కాంగ్రెస్ ‘రాజకీయం’.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
సాంస్కృతిక ఉద్యమం
తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెలంగాణకు అస్తిత్వం అయిన బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ఆమె చేసిన సాంస్కృతిక ఉద్యమం మామూలుది కాదు. తెలంగాణ ఆడబిడ్డల్ని ఉద్యమంలో మమేకం చేయడానికి ఆమె ఎత్తుకున్న బతుకమ్మ ఎంతో మందిని కదిలించింది. కదిలి వచ్చేలా చేసింది. తెలంగాణ సాంస్కృతి.. తెలంగాణ సంప్రదాయం అంటేనే బూతు లాగా ధ్వనించిన ఒక సందర్భంలో.. బతుకమ్మ ద్వారా వాటన్నింటిని పటాపంచలు చేసింది కవిత. అందువల్లే ఆమె తెలంగాణ బతుకమ్మగా పేరుపొందింది. ఎంగిలి పూల నుంచి మొదలుపెడితే సద్దుల బతుకమ్మ వరకు ఆమె అడుగు పెట్టని ఊరంటూ లేదు. గౌరమ్మను నిలుపుకోవడం.. తంగేడు పూలతో బతుకమ్మను పేర్చడం.. పాటలు పాడి చెరువులో నిమజ్జనం చేయడం.. ఇదే క్రతువుగా సాగిపోయింది కవిత. అటువంటి బతుకమ్మకు నేడు కష్టం వచ్చింది. పుట్టిన ఇంటి నుంచి ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైంది. పండగపూట ఏ ఆడబిడ్డకు ఇటువంటి కష్టం రావద్దు. ఇటువంటి ఇబ్బంది అసలు రావద్దు. పున్నమి 15 రోజుల్లో వెలుగు వెలిగే చంద్రుడు కూడా.. అమావాస్య రోజులలో మసకబారతాడు. అలాగని ఎప్పటికీ చీకట్లో ఉండిపోడు. ఇప్పుడు కవిత పరిస్థితి కూడా అలాంటిదే. తాత్కాలికంగా ఆమె ప్రభ కొంతమేర ఇబ్బందికి గురైనప్పటికీ.. ఆ తర్వాతి రోజుల్లో దీపశిఖలాగా వెలుగుతూనే ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే ఆమె.. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రభను కోల్పోరు.
మేమున్నాం..
పుట్టినింటి నుంచి కాస్త ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ.. మేమున్నామంటూ పుట్టిన గడ్డవాళ్ళు కవిత దగ్గరికి వచ్చారు. కెసిఆర్ స్వగ్రామం చింతమడక గ్రామస్తులు తెలంగాణ బతుకమ్మ దగ్గరికి స్వయంగా వచ్చి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో భాగస్వామి కావాలని స్వాగతం పలికారు. చీర, సారె, పసుపు కుంకుమలతో సాదర ఆహ్వానం పలికారు. ఒక ఆడబిడ్డకు ఇంతకంటే కావలసిందేముంది. పండగ పూట ఇంతకంటే ఘనమైన ఆతిథ్యం ఇంకొకటి ఏమంటుంది. ఇది తెలంగాణ బతుకమ్మకు దక్కిన నిండైన గౌరవం. కెసిఆర్ కుమార్తెకు కెసిఆర్ స్వగ్రామం నుంచి లభించిన గొప్పదైన సత్కారం. ఇప్పుడు కవిత మనసు చాలా తేలికైంది. గుండెలో భారం తగ్గిపోయింది. ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ దగ్గరికి బతుకమ్మ వడివడిగా అడుగులు వేసుకుంటూ వచ్చింది కాబట్టి..