AP Telangana Debts: అప్పు అనేది ఏ దేశానికైనా అవసరమే. అంతటి అమెరికా కూడా ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు తీసుకుంటుంది. ఆ అప్పును సకాలంలో చెల్లిస్తుంది. ఇలా చేస్తే పెద్ద తప్పేమీ కాదు. మనం కూడా ఓ ఇల్లు, కారు, బండి, బంగారం.. ఇలా మన అవసరానికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఎంతో కొంత అప్పు తీసుకొస్తాం. ఆ తర్వాత చెల్లిస్తూ ఉంటాం.. అయితే ఇదే సూత్రం దేశాలకు, రాష్ట్రాలకు వర్తిస్తుంది. అయితే తీసుకొచ్చే ఆ అప్పును తీర్చకపోతేనే ప్రమాదం.. ఓ శ్రీలంక, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలు, మన పక్కనే ఉన్న పాకిస్తాన్ తీసుకొచ్చిన అప్పులను సకాలంలో చెల్లించకపోవడంతో దివాలా తీశాయి. మళ్లీ ఆ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రజలపై అడ్డగోలుగా టాక్స్ లు విధిస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ప్రభుత్వాలు తీసుకొచ్చే అప్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలను మీడియా రాస్తూ ఉంటుంది. కాక పోతే తెలుగు నాట మీడియా స్టైల్ వేరు కదా. ఓ పత్రిక స్టైల్ మరింత వేరు కదా..
ఆంధ్ర ప్రదేశ్ ను జగన్ మోహన్ రెడ్డి అప్పుల కుప్ప చేశాడు. ఎప్పటికప్పుడు అప్పులు తీసుకొస్తున్నాడు. అదే మా చంద్రబాబు ఉంటే అప్పులు తీసుకొచ్చేవాడు కాదు. భవిష్యత్ తరానికి కూడా ఏమీ మిగిల్చకుండా జగన్ మొత్తం సాంతం నాకేస్తున్నాడు.. ఇలానే ఉంటాయి ఆ పత్రిక వక్రీకరణలు. అంటే ఇక్కడ జగన్ సుద్దపూస అని మేము చెప్పడం లేదు. కాకపోతే ఒక ప్రభుత్వానికి రాష్ట్ర నిర్వహణకు సంబంధించి అప్పు తీసుకునే అధికారం ఉంటుంది. అయితే ఏపీ విషయంలో ఓ వర్గం మీడియాకు ఇది నచ్చడం లేదు. పైగా అధికార ప్రభుత్వంపై వార్తలు రాస్తోంది. అంతేకాదు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మరో వెనిజులా చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇదే మీడియా చంద్రన్న సిక్సర్ పై మాత్రం విపరీతమైన పాజిటివ్ వార్తలు రాస్తున్నది.. నవరత్నాల పేరుతో జగన్ చేస్తోంది కూడా అదే కదా.. అందులో తప్పు ఉన్నప్పుడు.. చంద్రబాబు సిక్సర్ లో కూడా తప్పు ఉన్నట్టే కదా.. కానీ చంద్రబాబు విషయంలో ఆ మీడియాకు ఒప్పు లాగా.. జగన్ విషయంలో తప్పు లాగా కనిపిస్తుంది.
ఇక ఇదే మీడియా తెలంగాణ విషయంలో విపరీతమైన ఉదారత చూపుతుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చి మొదటి నెలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికే మూడుసార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద అప్పులు తీసుకొచ్చింది. వాటికి బాండ్లు కూడా ఇష్యూ చేసింది. తాజాగా మరో వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది. 22 సంవత్సరాలలో ఈ అప్పు తీర్చుతామని తెలంగాణ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు హామీ ఇచ్చింది. అయితే ఏపీ నుండి జగన్ ప్రభుత్వం మాత్రం రిజర్వ్ బ్యాంకు వద్ద 1000 కోట్లు అప్పు తీసుకొని దానిని 13 సంవత్సరాల లో తీర్చుతామని హామీ ఇచ్చింది. ఇందులో ఏ రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్నట్టు? ఇటీవల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి చేసిన అప్పులపై కాంగ్రెస్ చేసిన విమర్శలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ఏం సమాధానం చెబుతుంది? ఈ విషయాలను ఏపీలో రాసినట్టు ఓ వర్గం మీడియా తెలంగాణలో ఎందుకు రాలేకపోతోంది? అంటే ఈ ప్రశ్నలకు జవాబు చాలా సింపుల్. మనవాడు అప్పు చేస్తే ఒప్పు. అదే గిట్టని వాడు అప్పు చేస్తే తప్పున్నర తప్పు.