Telangana TDP : తెలంగాణ టిడిపిలో సమీకరణలు మారుతున్నాయి.పార్టీలో చేరికలు పెరిగే అవకాశం ఉంది.ఇప్పటికే మాజీ మంత్రి బాబూ మోహన్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఏకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు పసుపు రంగు చొక్కా తో వచ్చిన ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. త్వరలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజకీయ ఊగిసలాటలో ఉన్న ఓ ఎమ్మెల్యే సైతం టిడిపి వైపు చూస్తున్నట్లు సమాచారం. చాలామంది ఇతర పార్టీ నాయకులు సైతం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తెలంగాణలో పార్టీని నడిపించేందుకు సరైన నాయకుడు అవసరం. గత కొద్దిరోజులుగా తెలంగాణలో టిడిపి అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అయితే బీసీలకు ఆ పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణలో పార్టీని బతికించాలని చంద్రబాబు ప్లాన్. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. ఆయన చురుగ్గానే పనిచేశారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టిడిపి దూరం కావడంతో కాసాని జ్ఞానేశ్వర్ అలిగారు. బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ గెలవలేకపోయారు. ప్రస్తుతం ఆయన కెసిఆర్ పార్టీకి అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. చంద్రబాబు పిలిస్తే మళ్లీ టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబుకు సైతం సంకేతాలు అందినట్లు సమాచారం. త్వరలో కాసాని జ్ఞానేశ్వర్ కు పార్టీలోకి రప్పించి పగ్గాలు అప్పగిస్తారు అన్నది ఒక ప్రచారం నడుస్తోంది.
* అక్కడి పార్టీ శ్రేణులతో సమావేశం
నిన్ననే తెలంగాణ పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ టిడిపిలో అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి గ్రామస్థాయి కమిటీల వరకు ఎంపిక చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో టిడిపి క్యాడర్ చెక్కుచెదరలేదని.. కానీ నడిపించే నాయకత్వం లేకపోవడం వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బలమైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు.
* ఆ ముగ్గురు ఆశావహులు
వాస్తవానికి నెల రోజుల కిందటే తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవి భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రధానంగా అరవింద్ గౌడ్ పేరు వినిపించింది. ఈయన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ మేనల్లుడు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. ఇతర పార్టీల నుంచి పిలుపు వచ్చినా విడిచి వెళ్లలేదు. మరోవైపు బి. నరసింహులు, నర్సిరెడ్డి సైతం పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చి.. మిగిలిన ఇద్దరినీ పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది.
* కాసాని జ్ఞానేశ్వర్ వైపు మొగ్గు
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాసాని జ్ఞానేశ్వర్ అయితే పార్టీ అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. జ్ఞానేశ్వర్ బలమైన బీసీ నేత. ఆర్థికంగా కూడా బలమైన వారే. బీసీ సంఘాల్లో పనిచేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఆయనకు పగ్గాలు అప్పగిస్తే పార్టీకి పూర్వవైభవం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కాసాని జ్ఞానేశ్వర్ ను వీలైనంతవరకు పార్టీలోకి రప్పించి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More