https://oktelugu.com/

Turmeric Board : నెరవేరిన పసుపురైతుల కల.. పండుగరోజు శుభవార్త చెప్పిన కేంద్రం.. బోర్డు ప్రారంభం.. తొలి చైర్మన్‌గా ఎవరంటే..

నిజామాబాద్‌ పసుపు రైతులు చిరకాల ఆకాంక్ష నెరవేరింది. వారి పోరాటానికి ఫలితం దక్కింది. తతాము పండించే పంటకు మద్దతు ధర దక్కాలంటే.. పసుపు బోర్డు(Turmaric Board) కావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోర్డు ప్రకటించిన కేంద్రం సంక్రాంతి రోజు రైతుల కల నెరవేర్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 14, 2025 / 08:07 PM IST
    Follow us on

    Turmeric Board : నిజాబాబాద్‌ అంటే తెలుగు రాష్ట్రాల రైతులకు గుర్తుకు వచ్చేది పచ్చ బంగారం(పసుపు పంట). మద్దతు ధర కోసం నిజాబాబాద్‌ పసుపు రైతులు దశాబ్దాలుగా పోరాటం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుచేస్తే తమ కష్టాలు తీరుతాయని ఉద్యమించారు. ఈ అంశం ఎన్నికల హామీగా కూడా మారిపోయింది. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల కవిత(Kalvakuntal Kavitha)ను ఒకసారి ఎంపీగా గెలిపించింది పసుపు రైతులే. తర్వాత ఓడిపోవడానికి కారణం కూడా పసుపు రైతులే. తనను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ రాసి ఇచ్చిన ధర్మపురి అరవింద్‌(Dhrmapuri Aravind) ఆలస్యంగా అయినా సాధించారు. దీంతో మరోసారి అదే రైతులు ఎంపీగా గెలిపించారు. దీంతో గెలిచినా ఆరు నెలలల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయించారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని 2025, జనవరి 14న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డును ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీ ధర్మపురి అరవింద్‌ కూడా ఉన్నారు. మోదీ ఆశీర్వాదంతో నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటైందని తెలిపారు.

    తొలి చైర్మన్‌గా గంగారెడ్డి..
    ఇక పసుపు బోర్డు తొలి జైర్మన్‌గా పల్లె గంగారెడ్డి(Ganga Reddy) నియమితులయ్యారు. ఈమేరకు కేంద్రం జనవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. గంగారెడ్డి నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ రైతు. బోర్డు ఏర్పాటు చేసిన జిల్లా రైతుకే కేంద్రం తొలి చైర్మన్‌గా అవకాశం కల్పించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న గంగారెడ్డి తొలుత ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. 1991 నుంచి 1993 వరకు అంకాపూర్‌ గ్రామకమిటీ అధ్యక్షుడిగా, 1993 నుంచి 1997 వరకు బీజేపీ ఆర్మూర్‌ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బీజేపీ నిజాబాబాద్‌ జిల్లా కార్యదర్శిగా, రెండుసార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

    2023లో ప్రకటన..
    ఇదిలా ఉంటే పసుపు బోర్డును 2023 అక్టోబర్‌ 1న మహబూబ్‌నగర్‌ బహిరంగ సభలో ప్రధాని మోదీ(Modi) ప్రకటించారు. అక్టోబర్‌ 4న కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్‌ జారీ చేసింది. అయితే ప్రధాన బోర్డు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేసేది పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతుల కల నెరవేర్చింది. ఈ బోర్డు కోసం 2019 లోక్‌సభ ఎన్నికల్లో 176 మంది రైతులు నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆ ఎన్నికల్లో ఈసీ ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 12 ఈవీఎంలు ఉపయోగించింది. ఇక ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి(waranasi)లో కూడా 30 మంది పసుపు రైతులు నామినేషన్‌ వేశారు.