MLC Kavitha- Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు చార్జిషీట్లో ఈడీ ప్రస్తావించిన నాటి నుంచి… నిన్న సీబీఐ విచారణకు హాజరుకావాలని నోటీసు పంపించిన నాటి నుంచి.. రాష్ట్రంలో పింక్ మీడియా చేస్తున్న గాయి గత్తర అంతా ఇంతా కాదు. నిప్పు లేనిదే పొగరాదు. మరి లిక్కర్ స్కాం లో ఎటువంటి అక్రమాలు జరగకపోతే కవిత పేరు ఎందుకు వస్తుంది? ఆమె పేరును ఈడీ ఎందుకు ప్రస్తావిస్తుంది? ఆ గులాబీ నాయకుల మాటలు దేనిని సూచిస్తున్నాయి? ఇన్ని ప్రశ్నలకు ఒక్కటంటే ఒక్కటి సరైన సమాధానం గులాబీ క్యాంపు నుంచి రాలేదు. రాదు.. ఎందుకంటే అక్కడ స్కాం జరిగింది నిజం. సౌత్ గ్రూప్ నుంచి లావాదేవీలు జరిగింది నిజం.

వాళ్లే అభ్యర్థించారా
” ఔను వాళ్లే అభ్యర్థించారు. నా వివరణ కావాలి అన్నారు. సరే మీరే మా ఇంటికి (తనకు ఇల్లు లేదని 2018 ఎన్నికల్లో కవిత తన ఆఫిడవిట్లో పేర్కొన్నది) రండి అన్నాను. ఇందులో భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు.. అసలు సీబీఐ నోటీసులకే అంత సీన్ లేదు” ఎమ్మెల్సీ కవిత ఇలానే చెబుతోంది. అసలు అది పెద్ద ఇష్యూ నే కాదంటూ బుకాయిస్తోంది. పైగా వాళ్ళు విచారణ కోసం రావడం లేదు.. జస్ట్ ఏదో వివరణ కోసం వస్తున్నారు అంటోంది. ఆమె చెప్పినట్టు నమస్తే తెలంగాణ, టీఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా కూడా “అవి సమన్లు కూడా కావు.. అనుమాన నివృత్తి కోసం నోటీసులు. దానికోసం చిలువలు పలువలు దేనికి” అంటూ ప్రశ్నిస్తున్నాయి.. సరే వాళ్ళు చెప్పినట్టుగానే విచారణ కాదు.. వివరణ కోసమే అని చెప్పుకోవడానికి ఎందుకింత తండ్లాట.. అందులో ఉన్న ఫాయిదా ఏమిటి? టిఆర్ఎస్ నాయకులను ఇంటికి పిలిపించుకొని మొన్న చేసిన ఆ గాయి గత్తర మాటేమిటి? ఈడీనా, మోడీ నా, రానివ్వండి.. ఏం చేస్తారు? మహా అయితే జైల్లో పెడతారు. ఉరి అయితే తీయరు కదా?! ఆ గాంభీర్యపు స్ఫూర్తి మాటలు ఏమైనట్టు? కవిత అనుకున్నట్టుగానే, ఆమె గ్యాంగ్ అనుకున్నట్టుగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి నోటీసులు వచ్చాయి. “ఏం అడుగుతారో అడగనీయండి.. నేను చెప్పేది చెప్తాను”. ఇవి కదా కవిత నుంచి రావాల్సిన మాటలు. నమస్తే తెలంగాణ చెప్పినట్టు అందులో సాంకేతికంగా ఎటువంటి పదాలు వాడినప్పటికీ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆమెను విచారిస్తున్నది అనేది నిజం..
పేరు ప్రస్తావించిన నాటి నుంచి..
లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదట ఆమె పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. మొన్న అరోరా అనే నిందితుడి రిమాండ్ రిపోర్ట్ సందర్భంగా ఆమె పేరు చార్జ్ షీట్ లో నమోదు చేశారు. ఇది కూడా నమస్తే తెలంగాణ రాయలేని నిజం. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆమెను ఓ నిందితురాలిగా ఈడీ, సీబీఐ పరిగణిస్తున్నాయి అనేది కూడా నిజం. ఆ దర్యాప్తు, ఆ విచారణలో భాగంగానే ఆమెకు నోటీసులు వచ్చాయనిది కూడా నిజం.. ఆఫ్టరాల్ 160 సెక్షన్ నోటీసులు దేనికి పనికిరావని, అవి లీగల్ గా చెల్లవని చెప్పుకోవడం దేనికి సంకేతం? ఇదే లెక్కన మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులోనూ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు కూడా లీగల్ గా చెల్లవనే కదా అర్థం. నిజానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పష్టంగానే చెబుతోంది.. “లిక్కర్ స్కాంలో చేస్తున్న దర్యాప్తులో భాగంగానే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసేందుకు వస్తామని”, దర్యాప్తు నోటీస్ కూడా అదే చెబుతోంది.. మీకు చాలా విషయాలు తెలుసు.. అందుకే మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి అంటుంది.. మరీ ముఖ్యంగా నాటి జగన్ కేసు నుంచి నేటి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దాకా సిబిఐ పంపించే దేశంలో టోన్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఏమవుతుంది
అయితే ఈ నోటీసులతో అయ్యేది ఏముంది? ఈ ప్రశ్నకు సిబిఐ, ఈడి సీరియస్ గా ఉన్నాయనేది పరిశీలించాల్సిన కీలక అంశం. అవి ఎలాగూ స్పష్టంగానే ఉన్నాయి. ఈ కేసులో కవిత ప్రమేయం ఉన్నదని ఈడి అంటోంది.. పది ఫోన్లను ధ్వంసం చేశారని చెబుతోంది.. నమస్తే తెలంగాణ చెప్పినట్టు, బాల్క సుమన్ లాంటివాళ్ళు గడాగడా వాగినట్టు నిజాలే చెప్పొచ్చు కదా. లిక్కర్ స్కాంలో నా ప్రమేయం లేదని స్పష్టం చేయవచ్చు కదా. అలా జరగదు. అది అసలు జరగదు. ఎందుకంటే అందులో చేతివాటం ఉంది. అందుకే పొగ వస్తోంది. ” సీబీఐ వాళ్లేదో అభ్యర్థించారు. సర్లే రమ్మన్నాను” అన్నట్టు ఆ గాంభీర్యం మాటలు మాట్లాడటం దేనికి? అదే అర్థం కాని విషయం. ఒకటి మాత్రం స్పష్టం. దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం.