
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను పోలీసులు జైల్లో నుంచి ఇప్పట్లో బయటికి రానిచ్చేలా కనిపించడంలేదు. ఆయనకు ఒక కేసులో బెయిల్ వస్తుందనుకుంటే మరో కేసులో అరెస్టు చూపిస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో జరిగినట్లుగానే ఇప్పుడు తెలంగాణలో తీన్మార్ మల్లన్న విషయంలో జరుగుతోంది. చింతమనేనిపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. వాటికి ఆధారాలు ఉన్నాయా, లేవా అన్నది పక్కనబెడితే.. ఒక కేసులో రిమాండ్ ముగిసిందనుకుంటున్న సమయంలో మరో కేసులో అరెస్టు చూపించారు. ఇలా దాాదాపు మూడు నెలలు జైల్లలోనే గడపారు చింతమనేని. ఇప్పుడు మల్లన్నను కూడా అలాగే కేసుల మీద కేసులు చూపిస్తూ జైల్లో ఉంచుతున్నారు.
క్యూ న్యూస్ పేరుతో యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న మల్లన్న ఇటీవల రాజకీయంగానూ ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నవిషయం తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అధికార పార్టీ అభ్యర్థపై దాదాపు గెలిచినంత పనిచేశారు. ఆ తరువాత తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకూ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ప్రత్యేకించి సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై తన యూట్యూబ్ చానల్ లో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. దీనిపై టీఆర్ఎస్ నుంచి ఆయనకు బెదిరింపులుకూడా వచ్చాయి. అనంతరం వేర్వేరు ఫిర్యాదులతో ఆయన కార్యాలయంపై పోలీసుల తనిఖీలు జరిగాయి. అయినా మల్లన్న వెనక్కి తగ్గలేదు.
మరోవైపు లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి గురించి తన చానల్లో చేసిన ప్రసారాలపై ఆ జ్యోతిష్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను డబ్బుల కోసం మల్లన్న బెదిరించాడని ఆయన చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి నెల రోజుల క్రితం మల్లన్నను అరెస్టు చేశారు. అది మొదలు.. మల్లన్నపై ఉన్న ఇతర కేసుల్లో వరుస అరెస్టులు చూపిస్తూ జైల్లోనే ఉంచుతున్నారు.
తాజాగా మల్లన్నకు బెయిల్ వచ్చిందన్న ప్రచారం జరగగా.. నిజామాబాద్ లో మరో కేసులో అరెస్టు చూపించారు. పాదయాత్ర పేరుతో మల్లన్న తనను బెదిరించి డబ్బు వసూలు చేశారంటూ ఓ కల్లు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కేసులో ఏ5గా ఉన్న మల్లన్నను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని రాత్రి నిజామాబాద్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఇంకా ఎన్ని కేసుల్లో ఆయన అరెస్టు చూపిస్తారో, ఎంతకాలం జైల్లో ఉంచుతారో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ, మల్లన్న జైల్లో ఉన్న కారణంగా ఆయన క్యూన్యూస్ చానల్లో రోజూ ఉదయం చేసే న్యూస్ అనాలసిస్ ను పాలో అయ్యే లక్షల మంది వ్యూయర్స్ మాత్రం కాస్త నిరాశ చెందుతున్నారు. మరోవైపు ఆయన పాదయాత్ర ప్రణాళిక కూడా పక్కన పడినట్లు అయింది.