Telangana Govt Hospitals: ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం, వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఆరోగ్య రంగంలో దేశంలోనే మేటి అని డబ్బాలు కొడుతోంది. సొంత రాష్ట్రంలోనే కాదు బయటి రాష్ట్రంలోనూ ప్రకటనలు ఇస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉత్త డొల్ల అని తేలిపోతోంది. అంతేకాదు సామాన్య రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయడంలోనూ అక్కడి వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన మహిళలు మృత్యువాత పడటమే ఇందుకు ఒక ఉదాహరణ. పైగా ఇలాంటి వాటిని ఏదైనా పత్రిక రాస్తే అంత ఎత్తున ఎగిరిపడే నమస్తే తెలంగాణ.. లోపాలను మాత్రం దాచిపెడుతూ ఉంటుంది. పైగా పొరుగు రాష్ట్రాల్లో ఇలా ఉంది, దేశానికి కెసిఆర్ పాలన కావాలి అంటూ వితండవాదం చేస్తుంది. సరే అది భారత రాష్ట్ర సమితి కను సన్నల్లో నడిచే పత్రిక కాబట్టి.. దాన్ని అలా వదిలేస్తే.. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖలో ఒక ఉన్నతాధికారి అనారోగ్యం బారిన పడటం.. ఆయన ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్సకు వెళ్లడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది.
ఆయన వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతాధికారి. ఒక రకంగా చెప్పాలంటే వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద దిక్కు పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల ఛాతిలో ఆయనకు నొప్పిగా అనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సమస్యను గుర్తించిన వైద్యాధికారులు ఆయన గుండెకు రెండు స్టంట్స్ వేశారు. మంగళవారం ఆయన డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే కోవిడ్ తర్వాత గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోవడం.. పైగా ఆకస్మాత్తుగా మరణాలు చోటుచేసుకుంటుండం ఇటీవల బాగా పెరిగిపోయింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రులు తన చేతిలో ఉన్నప్పటికీ.. ఆయన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఆయన మాత్రమే కాకుండా వైద్య ఆరోగ్యశాఖలో పలు విభాగాల అధిపతులు కూడా ప్రైవేటు వైద్యం పైనే నమ్మకాన్ని పెంచుకోవడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. పేరుకు మాత్రం అధికారులు సర్కారు వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని చెబుతారు. అంటే ఈ లెక్కన ప్రభుత్వాసుపత్రులు కేవలం పేదలకు మాత్రమే అనే సందేశాన్ని వారు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి లక్షలకు లక్షలు జీతాలు తీసుకొని తాము మాత్రం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకుంటామని వారు సందేశం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఒక ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ కు గుండె పోటు వచ్చింది. వెంటనే ఆయన ఒక పేరు పొందిన ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నారు. ఈ విషయం బయటికి పొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ఏకంగా ఆయన పదవి పోయేందుకు కారణమైంది. ఆరోగ్యశాఖలోని ప్రధాన విభాగ అధిపతుల్లో ఆధునికలు గుండెపోటుకు గురైన వారు ఉన్నారు. ప్రధాన విభాగాలకు చెందిన అధిపతుల గుండెలకు స్టంట్స్ పడ్డాయి. ఒక విభాగాధిపతికైతే ఏకంగా ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయింది. అయితే వీరంతా కూడా తమ గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా కార్పొరేట్ ఆసుపత్రిలో చేయించుకోవడం.. ఆ బిల్లులు ప్రభుత్వం చెల్లించడం ఇక్కడ విశేషం.
కేవలం ప్రభుత్వ వైద్య విభాగాధిపతులు మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏనాడూ సర్కారు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నది లేదు. ఏడాది మార్చి 11న తనకు అనారోగ్యంగా ఉండగానే ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి యాంజియోగ్రామ్ తీయించుకున్నారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పుడు కూడా అదే ఆసుపత్రి వైద్యులతో తన విడిది గృహంలో చికిత్స తీసుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 12న గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి గ్యాస్స్ట్రోఎంటరాలజీ పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యమంత్రి నడుస్తున్న దారిలో అన్న రీతిగా వైద్య శాఖలోని హెచ్ ఓ డి లు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల బాట పట్టారు. తాజాగా సర్జరీ చేయించుకున్న అధికారి పరిధిలోనే రాష్ట్రవ్యాప్తంగా బోధన ఆసుపత్రులు ఉంటాయి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రి కూడా ఆయన పరిధిలోనే ఉంటాయి. అయితే తాను విభాగాధిపతిగా ఉన్న ఆస్పత్రిలో కాకుండా ప్రైవేటుకు ఎందుకు వెళ్లారు అన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. సర్కారు వైద్యంపై సర్కారుకే నమ్మకం లేదా? పెద్ద ఆసుపత్రుల పెద్ద దిక్కుకూ ప్రైవేటే దిక్కా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సదరు వైద్యాధికారి నిర్వాకంపై వైద్య ఆరోగ్యశాఖ వాట్సాప్ గ్రూపులో కొంతమంది వైద్యులు వైరల్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది..