Business Pressures vs Truth: ఆ పత్రిక యజమాని నీతులు బాగా చెబుతాడు. సుద్దులు బాగా వల్లె వేస్తాడు. కానీ తన సంస్థలో మాత్రం అడ్డగోలుగా నిబంధనలు విధిస్తాడు. నెత్తి మాసిన నిర్ణయాలు తీసుకుంటూ సిబ్బందిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు.. ఆఫ్ కోర్స్ ఆ పత్రిక యజమాని ఒకటి చెప్తే.. మిడిల్ స్టేజ్ మేనేజ్మెంట్ అంతకుమించి అన్నట్టుగా కింది స్థాయి సిబ్బంది మీద ఒత్తిడి తెస్తుంది.
వాస్తవానికి మిగతా వారికి పాత్రికేయం మీద అవగాహన ఉండదు కాబట్టి.. పైగా వారికి వ్యాపారాలు ఉంటాయి కాబట్టి.. కింది స్థాయి వ్యవహారాలు తెలియవు. కానీ ఒక పత్రికలో పనిచేసి.. ఒక పత్రిక నడిపిస్తున్న ఆయనకు కిందిస్థాయి బాధలు తెలియదనుకుంటే పొరపాటే. అన్నీ తెలిసినప్పటికీ ఆయన ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లిపోవాలంటూ కొద్దిరోజులుగా హంగామా సృష్టిస్తున్నారు.. వాస్తవానికి గత 12 సంవత్సరాలుగా ఆయన పత్రికను పట్టించుకుని లేదు.. మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పత్రికకు మూల విభాగమైన సెంట్రల్ డెస్క్ కు వెళ్ళింది కూడా లేదు.
పత్రిక పొలిటికల్ లైన్ ఏమిటో తెలియదు. ఎప్పుడు ఈ క్షణాన లైన్ మారుతుందో అర్థం కాదు. పైగా మెయిన్ పేజీ విషయంలో ఒకరకంగా.. జిల్లాల పేజీల్లో ఒక రకంగా ఆ పత్రిక మేనేజ్మెంట్ వ్యవహార శైలి ఉంటుంది. అలాంటప్పుడు జనాలలో విశ్వసనీయత ఏముంటుంది.. ఉదాహరణకు ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఓ మంత్రికి.. ఆ పత్రిక యజమానికి అత్యంత దగ్గర సంబంధం ఉంది. ఆ మంత్రి శాఖలో అడ్డగోలుగా అవినీతి జరుగుతోంది. కానీ ఇంతవరకు ఆయన పత్రికలో ఒక్క వ్యతిరేక కథనం కూడా రాలేదు. మరోవైపు పోటీపత్రికలు కథనాల మీద కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ జిల్లాలో ఇలా ఉంటే.. ఇక మిగతా జిల్లాల్లో ఆ పత్రిక స్టాండ్ మరో విధంగా ఉంటుంది.. ఇలా జిల్లాలకు జిల్లాలు మారుతూ ఉంటే ఆ పత్రికలో జనం ఎలా చూస్తారు? జనం ఎలా చదువుతారు?
నిరుటి కమిషన్ కే దిక్కులేదు
సర్కులేషన్ పెంచాలని.. మొదటి స్థానంలోకి రావాలని ఆ పత్రిక యాజమాన్యం ఈ ఏడాది చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. సరే అది ఆ పత్రిక యాజమాన్యం ఇష్టం .. పైగా నెంబర్ వన్ స్థానంలోకి రావాలని కోరుకుంటున్నది కాబట్టి అలాగే జరగాలని ఆశిద్దాం. కానీ గత ఏడాది రిపోర్టర్లు చేసిన కాపీలకు ఇంతవరకు కమిషన్ ఇవ్వలేదు. కమిషన్ గురించి అడిగితే పట్టించుకునే నాధుడు లేడు . ఇప్పుడు ఇక జిల్లాల వారీగా మళ్లీ సర్కులేషన్ మీటింగ్లు పెడుతున్నారు.. కచ్చితంగా ఒక్కో రిపోర్టర్ 20 నుంచి 50 కాపీల వరకు చేయాలని షరతులు విధిస్తున్నారు.. జిల్లాలలో బ్రాంచ్ మేనేజర్లు, బ్యూరో ఇన్చార్జులు, ఎడిషన్ ఇంచార్జిల ఆధ్వర్యంలో రిపోర్టర్లతో మీటింగ్ లు పెడుతున్నారు. కాపీల సంఖ్య పెంచాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు.
ఇదే సమయంలో గత ఏడాదికి సంబంధించిన కమిషన్ గురించి రిపోర్టర్లు అడిగితే.. పెద్ద తలకాయలు మాట్లాడటం లేదు. పైగా సర్కులేషన్ పెంచని రిపోర్టర్ల అక్రిడేషన్ కార్డులు తిరిగి తీసుకుంటామని.. వారిని తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.. ఎప్పటినుంచో మీడియా ఫీల్డ్ లో ఉండి.. ఇతర పని చేతకాని వారంతా నయానో భయానో రిపోర్టర్లుగా సాగుతున్నారు. కిందా మీదా పడి చందాలు కట్టిస్తున్నారు. అయితే ఈ ఏడాది గత ఏడాదితో పోల్చితే సంవత్సర చందా 300 తగ్గించినట్టు తెలుస్తోంది. అలాగైనా సరే సర్కులేషన్ పెరుగుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు సమాచారం.. ఇప్పటికే రకరకాల తాయిలాలతో పాఠకులను ఆకట్టుకున్న ఆ సంస్థ.. ఇప్పుడు సంవత్సరం మొత్తానికి 1000 కంటే ఎక్కువ.. రెండువేల కంటే తక్కువతో చందా రుసుము నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలలో కొంతమంది విలేకరులు సంస్థ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
పెట్రోల్ కు సరిపోవడం లేదు
” ఇచ్చే లైన్ ఎకౌంటు బండిలో పెట్రోల్ కు సరిపోవడం లేదు. జీవన వ్యయం పెరిగిపోయింది. ఒక పట్లగా కవర్లు కూడా ఇచ్చేవారు లేరు. ముందేమో సంవత్సర చందాలు అంటున్నారు. ఆ తర్వాత వార్షికోత్సవ ప్రకటనలు అంటున్నారు. వార్త రాయడం కంటే ఇలాంటి పనికిమాలిన చాకిరి ఎక్కువైపోయింది. మార్కెటింగ్, సర్కులేషన్ డిపార్ట్మెంట్ చేసే పనులు మాకు అప్పగించడం ఏంటని” రిపోర్టర్లు వాపోతున్నారు. వారు ఎంత వాపోయినప్పటికీ పరిస్థితి మారదు. మారే అవకాశం లేదు. గొంగడి కింద కూర్చొన్నాక గొర్రె బొచ్చు పడకుండా ఉంటుందా.. ఇది కూడా అంతే.. దందాలు చేసేవాళ్లు, లాబీయింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఇందులో ఉండాలి.. అలాంటివారే పాత్రికేయ రంగంలో ఉండాలి. మిగతా వాళ్లకు స్థానం లేదు. అవకాశం లేదు. ముఖ్యంగా ఈ పత్రికలో.. ఇలాంటి పత్రికను నడిపిస్తూ.. విలువల ఘనాపాటిగా ఆ పత్రిక యజమాని తనను తాను చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు.