Builders Association: ఇప్పటికే ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయలేక తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో.. వివిధ పథకాలకు.. చెల్లింపులకు నగదు సర్దుబాటు చేయలేక తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలల నిర్వహకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. బకాయి ఫీజులను చెల్లించాలని డిమాండ్ కూడా చేశారు. ఇలా అయితే తాను కళాశాలలను మూసివేస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దానికి తగ్గట్టుగానే కళాశాలలు మూసివేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బకాయి ఫీజుల చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
Also Read: బీహార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా చంద్రబాబు.. కారణం అదే!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు వందల కోట్లు ఉంటాయని సమాచారం. దీనిని మర్చిపోకముందే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద మరో పిడుగు పడింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రేవంత్ ప్రభుత్వానికి ఇది తీవ్రమైన ఇబ్బందిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తమకు గడిచిన రెండు సంవత్సరాలుగా బకాయి ఉన్న 36వేల కోట్ల బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. లేనిపక్షంలో డిసెంబర్ ఒకటి నుంచి అన్ని శాఖల పరిధిలో ఉన్న సివిల్ పనులు మొత్తం ఆపివేస్తామని స్పష్టం చేసింది. “ఆస్తులు తాకట్టుపెట్టి కాంట్రాక్టర్లు పనులు చేశారు. వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. దీన్ని దృష్టిలో పెట్టుకొని బిల్లులు విడుదల చేయాలి. లేనిపక్షంలో పనులు నిలిపివేసి.. ఆందోళనలు నిర్వహిస్తాం.. ప్రభుత్వం వెంటనే బకాయి ఉన్న బిల్లులు చెల్లించాలని” బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బాధ్యులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు..
ఇప్పటికే ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రభుత్వం అంచనా వేసిన విధంగా ఆదాయం రావడం లేదు. బడ్జెట్ కేటాయింపులు అమలుకు నోచుకోవడం లేదు.. ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకోవాల్సిన అప్పుల పరిమితి కూడా పూర్తయిందని తెలుస్తోంది.. బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వం బాండ్లను విక్రయించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద అప్పులు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు.. ఇక ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా భారీగానే పెరిగిపోయాయి.. ఇటీవలే నెట్వర్క్ ఆస్పత్రులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.