CM Chandrababu Naidu: బీహార్( Bihar) ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ఏపీ సీఎం చంద్రబాబు మొన్న ఆ మధ్యన ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు బిజెపి పెద్దల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ సైతం బీహార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ప్రచారం నడిచింది. అయితే ఈరోజు తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈనెల 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. 14న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రచారానికి వెళ్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే లండన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఏపీకి తిరిగి వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరికి ప్రతిష్టాత్మకంగా రెండు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె స్వచ్ఛంద సేవలకు గాను ఒక అవార్డు రాగా.. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి ఒక అవార్డు వచ్చింది. సతీమణి భువనేశ్వరితో కలిపి లండన్ వెళ్లిన చంద్రబాబు అక్కడ పారిశ్రామికవేత్తలను సైతం కలిశారు. మూడు రోజుల పర్యటన విజయవంతం అయింది. ఏపీకి చేరుకోవడంతో ఆయన బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారని వార్తలు వస్తున్నాయి.
14 నుంచి పెట్టుబడుల సదస్సు..
ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు జరగనుంది. దేశీయ, విదేశీ దిగ్గజ సంస్థలు, పారిశ్రామిక ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు రానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ పారిశ్రామిక పెట్టుబడుల సదస్సుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు సీఎం చంద్రబాబు. ఇటువంటి పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎప్పుడు వెళ్తారు? అన్నది తెలియాల్సి ఉంది.
ఎన్డీఏలో కీలక భాగస్వామిగా..
ఎన్డీఏలో( National democratic Alliance ) చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నారు. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. గతంలో ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరుపున చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ఆయా నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు బిజెపి పెద్దలు. అక్కడకు వెళ్లిన క్రమంలో.. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చనిపోయారు. దీంతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయకుండానే వెనుతిరిగారు. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలు బిజెపికి ప్రతిష్టాత్మకం. పైసా అక్కడ వరుసగా 20 సంవత్సరాలు పాటు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది కూడా. ఈ తరుణంలో చంద్రబాబు లాంటి చరిష్మా ఉన్న నేతతో ప్రచారం చేయిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్ర పెద్దలు వచ్చారు. చంద్రబాబు కూడా సమ్మతించారు. కానీ ఇప్పుడు పెట్టుబడుల సదస్సు పుణ్యమా అని బిజీ షెడ్యూల్లో ఉన్నారు చంద్రబాబు. ఇంతకీ ప్రచారానికి వెళ్తారా? వెళ్ళరా? అన్నది తెలియాల్సి ఉంది.