BRS: తెలంగాణ ఎన్నికలపై పై కోర్టు కు ఎక్కిన బీఆర్ఎస్

ఎన్నికలు జరిగిన ప్రతీసారి బీఆర్‌ఎస్‌ పార్టీ తమ పార్టీ గుర్తు కారును పోలిన కొన్ని గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని కోరుతోంది. ఈమేరకు ఎన్నికల సంఘానికి విన్నవిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : October 12, 2023 11:00 am

BRS

Follow us on

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వేళ… అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కోర్టుకెక్కింది. ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీకి తలనొప్పిగా మారిన కొన్ని గుర్తులను ఈసీ కేటాయించకుండా చూడాలని బుధవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఈసీకి పలుమార్లు వినతి..
ఎన్నికలు జరిగిన ప్రతీసారి బీఆర్‌ఎస్‌ పార్టీ తమ పార్టీ గుర్తు కారును పోలిన కొన్ని గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని కోరుతోంది. ఈమేరకు ఎన్నికల సంఘానికి విన్నవిస్తోంది. బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డు రోలర్‌ గుర్తును తొలగించినప్పటికీ తర్వాత ఎన్నికల నుంచి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ వస్తోంది. బీఆర్‌ఎస్‌ నేతలు ఆ గుర్తును తొలగించాలని కోరుతున్నారు.

ఇబ్బందిగా మారిన గుర్తులు ఇవీ..
కారును పోలిన రోడ్డు రోలర్‌తోపాటు కెమెరా, చపాతి రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్‌ వంటి గుర్తులు బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ గుర్తుల కారణంగా కారుకు పడాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పడుతున్నట్లు బీఆర్‌ఎస్‌ పేర్కొంటోంది. ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించొద్దని కోరుతోంది.

జాతీయ పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు..
తమకు అభ్యంతరం ఉన్న గుర్తులను కేటాయించడం వలన గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీచేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీచేసిన అభ్యర్థుల కన్నా అధిక ఓట్లు వచ్చిన వైనాన్ని ఆధారాలతో సహా బీఆర్‌ఎస్‌ ఈసీకి వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, తద్వారా బీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతున్నదని తెలిపింది. కానీ, బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది.