HomeజాతీయంBRS: ఢిల్లీ పీఠంపై బీఆర్‌ఎస్‌.. గట్టిగా అనుకుంటే అపోతుంది!?

BRS: ఢిల్లీ పీఠంపై బీఆర్‌ఎస్‌.. గట్టిగా అనుకుంటే అపోతుంది!?

BRS: కేజ్రీవాల్‌ పార్టీ పెట్టి.. దానిని జాతీయ స్థాయికి విస్తరిస్తారని ఎవరైనా అనుకున్నారా? పోని పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా నమ్మారా? ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ. అది కళ్ల ముందు కనిపించే నిజం. అలాంటివి రాజకీయాల్లో ఎన్నో జరిగాయి. రాజకీయాల్లో అసాధ్యం అనేది ఉండదు. కాస్త ఆలస్యం కావొచ్చు కానీ ఏదైనా సాధ్యమవుతుంది. ఈ విషయం దశాబ్దాలుగా రుజువు అవుతూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రస్థానం ప్రారంభించిన భారత రాష్ట్ర సమితిది కూడా అంతే. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ గురించి చిలువలు పలువుగా మాట్లాడవచ్చు. తేలికగా తీసుకోవచ్చు. కానీ రేపు ఏం జరుగుతుందో మాత్రం ఊహించడం కష్టం. అంత తేలికగా తీసిపడేయాల్సిన పార్టీ కూడా కాదు. ఎందుకంటే.. ఆ పార్టీని నడుపుతోంది కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని పార్టీ పెట్టినప్పుడు ఆయన మాటలను తెలంగాణ ప్రాంతానికి చెందిన 90 శాతం మంది నమ్మలేదు. మిగిలిన వారు ప్రయత్నిస్తే పోయేదేముందని ఆయన వెనుక నడిచారు కానీ.. రాష్ట్రం వస్తుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. కానీ కేసీఆర్‌ స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేశారు. ఆ స్వరాష్ట్రాన్నే గత ఎనిమిదేళ్లుగా పరిపాలిస్తున్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ ఢిల్లీకి గురిపెట్టడాన్ని తేలికగా తీసుకోవచ్చేమో కానీ.. పూర్తిగా తీసి పారేయలేం.

BRS
BRS

దేశంలో ప్రతిపక్ష శూన్యత..
దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ తిరుగులేని నేతగా ఉన్నారు. ఒకప్పుడు దేశానికి ఇందిరాగాంధీ ఎలాగో ఇప్పుడు అంత కంటే బలంగా మోదీ కనిపిస్తున్నారు. అప్పట్లో ఇందిర కాకపోతే ఎవరు అంటే.. ఒక్కరూ కనిపించేవారు కాదు. మేము అంటూ చాలా మంది జాతీయ నేతలు వచ్చినా ఇందిరా ఇమేజ్‌ ముందు సరితూగేవారు కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. మోదీ కాకపోతే ఎవరు అంటే ఎవరి వద్దా సమాధానం లేదు. కానీ.. మేము అంటూ చాలా మంది నేతలు ఉన్నారు. చారా రోజులుగా ఢిల్లీ పీఠంపై గురి పెట్టి కూర్చున్న శరద్‌పవార్‌ దగ్గర నుంచి నితీశ్‌కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ వరకూ చాలా మంది క్యూలో ఉన్నారు. బయటకు చెప్పకపోయినా స్టాలిన్, విజయన్‌ సహా అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎవరూ మోదీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. దేశ రాజకీయంలో ప్రతిపక్ష శూన్యత ఉంది. అందుకే కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టగలిగే నాయకుడిని తానే అని ప్రమోట్‌ చేసుకుంటున్నారు. అయితే సహజంగానే ఇతర నేతలు ఆయనకు మద్దతుగా నిలబడరు. ఎందుకంటే వారికీ ఆశలున్నాయి. కానీ, ఆమ్‌ ఆద్మీ పార్టీతోపాటు లెఫ్ట్‌ పార్టీల నుంచి కేసీఆర్‌కు మద్దతు లభించింది. కానీ అది ప్రధానమంత్రి అభ్యర్థిత్వం వరకూ వస్తుందా అంటే.. చెప్పలేం. వారి మద్దతు తెలంగాణ వరకే అనుకోవచ్చు. జాతీయ రాజకీయాలకు వచ్చే సరికి వారి మద్దతు కేసీఆర్‌కు లభించకపోవచ్చు. అందుకే కేసీఆర్‌ జాతీయ పార్టీతో దాదాపుగా ఒంటరి పోరాటానికే సిద్ధమయ్యారు. కలసి వచ్చే రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఆయన పోరాడనున్నారు.

ప్రత్యామ్నాయం అని భావిస్తే పట్టమే..
ఇప్పుడు మోదీని బలంగా ఎవరు ఢీకొడితే .. ఆయనకు తగ్గ ప్రత్యామ్నాయ నేతను అని నిరూపించుకోగలిగితే వారికి ప్రజల మద్దతు లభిస్తుంది. మోదీ కాదంటే ఎవరు అనేది ప్రజల మనసుల్లో కూడా ఉంది. ప్రస్తుత భారత ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ నేత పదేళ్ల పాటు అధికారంలో ఉంటే.. ప్రజల్లో మొహం మెత్తుతుంది. పదేళ్ల తర్వాత కూడా పాత పాలకుడేనా అని అనుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిని క్యాష్‌ చేసుకునే ప్రత్యామ్నాయ నేత ఉంటే.. సులువుగా విజయం సాధించవచ్చు. ఈ విషయంలో కేసీఆర్‌కు అడ్వాంటేజ్‌తో కూడిన అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్‌ చేయాల్సిందల్లా.. తాను మోదీకి దీటైన నేతను అని నిరూపించుకోవడమే. అయితే ఈ విషయంలో ఒక్క తెలంగాణ ప్రజల్ని మెప్పిస్తే సరిపోదు.. మొత్తం దేశాన్ని మెప్పించాలి. ముందుగా ఉత్తర భారతంలో మోదీని కాదని.. తనపైన ప్రజలకు నమ్మకం కలిగించుకోవాలి. కేసీఆర్‌ దీనిపై కసరత్తు చేయకుండా జాతీయ పార్టీని ప్రారంభించారని అనుకోలేం. ఆయన ప్రణాళికలు ఆయనకు ఉంటాయి. ఆర్థిక వనరుల పరంగా లోటు లేని పార్టీ బీఆర్‌ఎస్‌. రాజకీయ వ్యూహాల పరంగా తిరుగులేని పార్టీ. ప్రశాంత్‌ కిశోర్‌ లాంటి స్ట్రాటజిస్టుల మీద ఆధారపడి.. దేవుడా నీదే భారం అనని రాజకీయం కేసీఆర్‌ది. ట్రెండ్‌ ప్రకారం ప్రశాంత్‌ కిశోర్‌ ఆలోచనలను ఉపయోగించుకునే ప్రయత్నం చేసినా.. తర్వాత..అదంతా దండగ వ్యవహారం అని ఆయన త్వరగానే తెలుసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా తెలంగాణ సాధించిన తన పొలిటికల్‌ మైండ్‌నే వంద శాతం జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని నిలబెట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. కేసీఆర్‌ ముందు అవకాశం ఉంది.. కానీ అందిపుచ్చుకోవడం అంత తేలిక కాదు!

తొలి అడుగులే తడబడుతున్నాయి..
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి.. తొలి బహిరంగసభను విజయవంతంగా నిర్వహించారు. కానీ ఈ కొద్ది కాలం పయనంలోనే కేసీఆర్‌ అడుగులు తడబడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ అనుకున్నప్పటి నుంచి ఆయన వెనుకాల నిలిచిన కుమారస్వామి, తమిళ్‌ వీసీకే పార్టీలు .. ఇప్పుడు ఆయన వెంట లేవు. జాతీయస్థాయి రైతు సంఘాల ప్రతినిధులూ ఆయన వెంట లేరు. ఢిల్లీ రైతు ఉద్యమంతో జాతీయ దృష్టిని ఆకర్షించిన రాకేష్‌ టికాయత్‌ చాలాసార్లు కేసీఆర్‌ను కలిశారు. ఆయనతో పాటు పయనిస్తామన్నట్లుగా వ్యవహరించారు. కానీ కీలయ సభకు ఆయన కూడా లేదు. చివరికి ఒడిశా నుంచి గిరిధర్‌ గమాంగ్‌ను ఆయన కుమారుడ్ని పిలిపించి మాట్లాడి.. ఒడిశా బీఆర్‌ఎస్‌ చీఫ్‌ గా నియమించబోతున్నామని సంకేతాలు ఇచ్చినా.. వారు కూడా ఆవిర్భావ సభకు రాలేదు. వారు ఆ బాధ్యతలు తీసుకునేదుకు సిద్ధంగా ఉన్నారోలేదో స్పష్టత లేదు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సభ కల్లా రాజకీయ నేతలను అయినా లేకపోతే.. తటస్తులనైనా.. ప్రజల్లో కాస్త గుర్తింపు ఉన్న వారినైనా సరే పార్టీలోకి చేర్చుకుని కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ అనుకున్నారు. కానీ ఈ విషయంలో పూర్తిగా తడబడ్డారు. ఏపీ నుంచి నేతను ఆకర్షించి.. అధ్యక్ష పదవి కట్టబెట్టినా∙ఆయన పలుకుబడి శూన్యం. ఆయనను చూసి నాలుగు ఓట్లు వచ్చే అవకాశం లేదు. ఈ విధంగా చూస్తే.. కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ ద్వారా తొలి అడుగులతో తడబడ్డారని అనుకోవచ్చు.

BRS
BRS

తెలంగాణలో గెలవడమే అసలు సవాల్‌..
ఢిల్లీ కోసం యుద్ధం చేయడంకన్నా ముందు కేసీఆర్‌ గల్లీని గెలవాలి. ఇంట ఓడిపోయినవాడికి రచ్చ గెలవడానికి చాన్స్‌ ఉండదు. ఇంట ఓడిపోతే.. అసలు రేసులోనే ఉండరు. ఎవరూ పట్టించుకోరు. మూడోసారి తెలంగాణలో అధికారం చేపడితే.. ఆయన ఇమేజ్‌ అమాంతం పెరుగుతుంది. నరేంద్రమోదీ గుజరాత్‌లో మూడో సారి గెలిచినప్పుడు.. ఆయన దేశ నాయకుడు అన్న క్రేజ్‌ ఎలా వచ్చిందో.. తెలంగాణలో కేసీఆర్‌ మూడోసారి గెలిస్తే అలాంటి క్రేజ్‌ వస్తుంది. అందుకే కేసీఆర్‌ మొదటి లక్ష్యం ఇంట గెలవడమే. ఇప్పుడు ఇటు తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్ని బ్యాలె¯Œ ్స చేసుకోవాలి. రెండింటిలో ఏది తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అందుకే కేసీఆర్‌కు ఇది అసలైన టాస్క్‌ అని అనుకోవచ్చు.

ఎలా చూసినా బీఆర్‌ఎస్‌ ప్రారంభం.. యావరేజ్‌ అనుకోవాలి. భారీ బహిరంగ సభను సక్సెస్‌ ఫుల్‌గా నిర్వహించినా.. ఇతర పార్టీ వ్యవహారాలను చూస్తే అనుకున్నంత హైప్‌ తెచ్చుకోలేకపోయారు.. నేతలను ఆకర్షించలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్‌ ముందు అత్యంత క్లిష్టమైన టాస్కులు ఉన్నాయి. వీటిని అధిగమిస్తేనే ఢిల్లీపీఠం దగ్గరవుతుంది. అయితే అసాధ్యం మాత్రం కాదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular