KTR: తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కొంపలో కుంపటి రాజుకుందా అంటే అవుననే అంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. ఒకవైపు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల హోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఐదారు మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ అవిశ్వాస అస్త్రంతో బీఆర్‌ఎస్ నుంచి హస్తగతం చేసుకుంది. కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్‌పర్సన్లు కాంగ్రెస్ గూటికి చేరారు. అయినా గులాబీ నేతలు గప్‌చుప్‌గానే ఉంటున్నారు. ఒక్కో బల్దియాలో క్రమంగా పట్టు కోల్పోతూ వస్తున్న బీఆర్‌ఎస్‌కు అవిశ్వాసం సెగ ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాఖాకు చేరింది.
చైర్ పర్సన్‌పై అవిశ్వాసం?
సిరిసిల్ల దాదాపు రెండు దశాబ్దాలుగా కేటీఆర్ ఇలాఖాగా మారింది. ఇక్కడ ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. నియోజకవర్గంలో తనకు ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకున్నారు కేటీఆర్. పదేళ్లు అధికారంలో ఉండడంతో అభివృద్ధితోపాటు పార్టీపైనా మంచి కమాండింగ్ సాధించారు. ఆయనకు ఎదురు చేప్పేవారు. ఎదరు ప్రశ్నించేవారు కూడా లేకుండా పోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఇన్నాళ్లూ అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల బల్దియాపైనే తొలుత గురిపెట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళపై అవిశ్వాసం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
కౌన్సిలర్ల అసంతృప్తి..
సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ కళ తీరుపై కౌన్సిలర్లు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. కేటీఆర్‌ను చూసి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పవడం, అయినా చైర్‌పర్సన్ తన ఆధిపత్యం కొనసాగించడంతో ఒక్కసారిగా అసంతృప్త కౌన్సిలర్లు బరస్ట్ అయ్యారు. ఈ క్రమంలో అవిశ్వాస అస్త్రం ప్రయోగించేందుకు 12 మంది కౌన్సిలర్లు ఆదివారం క్యాంప్‌కు వెళ్లారని తెలుస్తోంది. మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా క్యాంప్‌లో ఉన్నవారితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఎన్నికల సమయంలో వ్యతిరేకత..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులు తొలిసారిగా కేటీఆర్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. సిరిస్లిలో కేటీఆర్ ఓడిపోతారట అన్న ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం ఊపందుకుంది. విషయం కేటీఆర్‌కు చేరడంతో ఆయన రంగంలోకి దిగారు. నాయకులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇన్నాళ్లు కలవకపోయినందుకు క్షమాపణ చెప్పారు. ఈసారి గెలిపిస్తే వారంలో రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. కేటీఆర్ గెలిచినా.. నాయకుల్లో అసంతృప్తి చల్లారలేదు.
కేటీఆర్ నియోజకవర్గంలో ఉండగానే..
బీఆర్‌ఎస్ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్ ఆదివారం సిరిసిల్లకు వెళ్లారు. ఈ సమయంలోనే కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సమావేశానికి కౌన్సిలర్లు డుమ్మా కొట్టి క్యాంప్‌కు వెళ్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన సొంత ఇలాఖాలోనే పార్టీని చక్కబెట్టుకోలేని కేటీఆర్ ఇక రాష్ట్రంలో పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారన్న అభిప్రాయం గులాబీ భవన్‌లో వ్యక్తమవుతోంది.