BRS Decline: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. మొదటి లక్ష్యం సాధించింది. స్వరాష్ట్రం సిద్ధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు.. రాష్ట్రం సాధించిన పార్టీగా 2014లో గులాబీ పార్టీకే పట్టం కట్టారు. మరోసారి 2018లో కూడా అవకాశం ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగింది. కానీ ఇప్పుడు పతనం దిశగా పయనిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ వారసుల చెరోదారి.. నాయకత్వ సంక్షోభం, వ్యక్తిగత విమర్శలతో కూడిన సోషల్ మీడియా వ్యూహంతో కొట్టుమిట్టాడుతోంది. గువ్వల బాలరాజు వంటి నాయకుల వలసలు, పార్టీ సోషల్ మీడియా విధానాలు, ప్రజా సమస్యలపై పోరాటాల లేమి వంటి అంశాలు బీఆర్ఎస్ దిగజారుడుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
Also Read: కేటీఆర్‌ను వదలని ‘గువ్వల’.. బీఆర్ఎస్లో మరో కలకలం
వ్యక్తిగత విమర్శలతో నష్టం..
బీఆర్ఎస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు వ్యవహారం పార్టీలోని అంతర్గత సమస్యలను స్పష్టంగా తెలియజేస్తోంది. బాలరాజు తన రాజీనామా లేఖలో బీఆర్ఎస్ నాయకత్వాన్ని గౌరవిస్తూనే, తన రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం ఆయనను, ఆయన భార్యను వ్యక్తిగతంగా విమర్శిస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీ ఇమేజ్ను మరింత దిగజార్చింది. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్లడం సర్వసాధారణం. అయితే, వలసపోయే నాయకులపై వ్యక్తిగత దాడులు చేయడం, బూతులతో కూడిన సోషల్ మీడియా పోస్ట్‌లు చేయడం వంటివి గులాబీ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా పోస్టులు ఆయనకు తెలియకుండా వస్తున్నవి కావన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి విమర్శలు ప్రజల్లో పార్టీపై చిరాకు, అసహ్యం కలిగించే అవకాశం ఉంది. బాలరాజు స్పందన కూడా ఈ విమర్శలకు బదులుగా తీవ్రంగా ఉండటం, బీఆర్ఎస్ వ్యూహం రివర్స్ అవుతున్నట్లు సూచిస్తోంది.
సోషల్ మీడియా వైఫల్యం..
బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యూహాలను ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విధానాలతో పోలుస్తున్నారు. వ్యతిరేకులపై అనుచిత వ్యాఖ్యలు, బూతులతో కూడిన ట్వీట్లు, తప్పుడు ప్రచారం చేయడం వంటివి బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రధాన లక్షణాలుగా మారాయి. ఈ విధానం ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవడమే కాక, పార్టీకి ఉన్న మద్దతుదారులను కూడా అసంతృప్తికి కారణమవుతోంది. సోషల్ మీడియాను రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు, కానీ అది సానుకూలంగా, ఆకర్షణీయంగా ఉండాలి. బీఆర్ఎస్ విషయంలో, సోషల్ మీడియా బృందం ప్రతికూల వ్యాఖ్యలపై దృష్టి సారించడం వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోంది.
ప్రజా సమస్యలపై పోరాటం ఎక్కడ?
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై గ్రౌండ్ లెవల్లో ఎలాంటి పోరాటం చేయలేదు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలు ఎక్కువగా రాజకీయ లక్ష్యాలతో లేదా కేసీఆర్ సమస్యల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు ఉపాధి, విద్య, ఆరోగ్యం, లేదా రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. కేవలం రాజకీయ లాభాల కోసం కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పార్టీ ప్రజల నుంచి దూరమవుతోంది. ఒక బలమైన ప్రతిపక్షంగా, ప్రజల సమస్యలను గుర్తించి, వాటి కోసం గళమెత్తి, ఉద్యమాలు నడిపితేనే ప్రజల విశ్వాసం సంపాదించగలదు.
Also Read: తెలంగాణ రాజకీయముఖ చిత్రాన్ని మూడు ముక్కల్లో చెప్పేసిన కవిత.. దెబ్బకు అంతా సైలెంట్
భవిష్యత్ లేని పార్టీగా?
బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం లేకుండా కొట్టుమిట్టాడుతోంది. పార్టీ నుంచి నాయకులు వలసపోవడం, సోషల్ మీడియాలో అనుచిత వ్యవహారం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వ్యక్తిగత దూషణలకు దిగడం, దిగజారుడు మాటలు మాట్లాడడం, ఇక కవిత సొంత పార్టీకి దూరం కావడం, గులాబీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పార్టీ నాయకత్వం ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచినప్పటికీ, ప్రస్తుతం పార్టీలో కొత్త నాయకత్వం, కొత్త వ్యూహాలు అవసరమైన సమయంలో పాత విధానాలతోనే ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది.