https://oktelugu.com/

KCR Family: వాళ్లిద్దరూ సైలెన్స్.. కేసీఆర్ ఫ్యామిలీకి వీడని కష్టాలు.. ఈ బాధల నుంచి బయటపడేది ఎప్పుడు?

పదేళ్లపాటు అధికారంలో కొనసాగి.. మొదటి సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. దాంతో రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయింది. అయితే అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైలెంట్ మోడ్‌లోనే ఉండిపోయారు

Written By: Srinivas, Updated On : November 13, 2024 5:27 pm

KCR

Follow us on

KCR Family: పదేళ్లపాటు అధికారంలో కొనసాగి.. మొదటి సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. దాంతో రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయింది. అయితే అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైలెంట్ మోడ్‌లోనే ఉండిపోయారు. ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు. దాంతో పార్టీని కేటీఆరే ముందుండి నడిపిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను పూర్తిగా తన తనయుడు కేటీఆర్‌కే అప్పగించారన్న టాక్ నడుస్తోంది.

దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కేటీఆరే ఆ పార్టీపై నిరసన తెలుపుతున్నారు. నిత్యం పార్టీ వైఫల్యాలపై నిలదీస్తూనే ఉన్నారు. ఎక్కడా బీఆర్ఎస్ మైలేజీ తగ్గకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రజల సమస్యలపై నిత్యం ప్రశ్నించాల్సింది పోయి ఫాంహౌస్‌కే పరిమితం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అనారోగ్య కారణాలా..? ఇతర ఏమైనా కారణాలా..? ఏవైనప్పటికీ కేసీఆర్ స్థానంలోకి కేటీఆర్ వచ్చారు. దాంతో 11 నెలలుగా ఆయనే పార్టీ బాధ్యతలను మీదేసుకొని ముందుకు సాగుతున్నారు. అయితే పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో కాస్త ఫ్రస్టేషన్‌లోనూ ఉన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ వైఖరిపైనా పార్టీలో విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నమ్ముకొని ఉన్న వారికి ముఖం చాటేయడంపై అసంతృప్తితో ఉన్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే.. కేసీఆర్ రేపు వస్తారు.. ఎల్లుండి వస్తున్నారు అంటూ ఎప్పటికప్పుడు ఫాంహౌస్ నుంచి లీకేజీలు వస్తూనే ఉన్నాయి. కానీ.. 11 నెలలుగా ఇంతవరకు కేసీఆర్ ప్రజలను కలుసుకున్నది లేదు. ఎప్పటికప్పుడు బయటకు వచ్చేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. కేసీఆర్ పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత పరిస్థితి మరొలా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఆరు నెలలపాటు తీహార్ జైలులో ఉన్నారు. జైలు జీవితం అనుభవించిన కవిత.. కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చాక కూడా తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఎవరినీ వదిలిపెట్టనని సవాల్ విసిరారు. అయితే.. ఆమె జైలు నుంచి బయటకు వచ్చి రెండు నెలలు గడుస్తోంది. కానీ.. ఇంతవరకు ఆమె రాజకీయంగా ఎలాంటి ముందడుగు వేయలేదు. అయితే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి వల్లనో, తండ్రి ఫాంహౌస్‌కే పరిమితం కావడం వల్లనో తెలియదు కానీ.. కవిత కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఆమె కూడా రెండు నెలలుగా ప్రజల్లోకి వచ్చిందే లేదు. అయితే.. అరెస్టు వల్ల ఆమె అవమానంగా భావిస్తున్నట్లుగానూ పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. దాంతోనే కేసీఆర్ తన కూతురును రాజకీయాల్లోకి దూరం పెడుతున్నారా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ కుటుంబం నుంచి ఇద్దరికి ఇద్దరు రాజకీయాల్లో నుంచి పక్కన ఉండడంతో.. ఇక బాధ్యతలన్నీ కేటీఆర్, హరీశ్ రావు మీదనే పడ్డాయి. అయితే.. కేసీఆర్, కవిత విషయంలో ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి..? అధినేత ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు..? అనేది ఆసక్తికరంగా మారింది. కేడర్‌లో మాత్రం ఈ ఇద్దరు కూడా ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు