BJP Rajasingh Issue : కమలం పార్టీలో ఒక్కసారిగా ముసలం పుట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి అధిష్టానం తీసుకున్న నిర్ణయం కలవరం కలిగిస్తున్నది. ఎవరూ ఊహించని విధంగా రామచంద్ర రావుకు అధ్యక్ష పదవి కట్టబెట్టడం పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి నెలకొన్నది. ఇప్పటికే గోషామహల్ శాసనసభ సభ్యుడు రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు పార్టీ అధిష్టానం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి తాను వెళ్లిపోతున్నట్టు.. ఇతర రాజకీయ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. రాజాసింగ్ ఉదంతం మర్చిపోకముందే.. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మరో బాంబు పేల్చారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో అరవింద్ లేదా ఈటల రాజేందర్ తెలంగాణకు బిజెపి అధ్యక్షుడవుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఒకసారిగా సంచలనం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పార్టీ అధిష్టానం ఎంపిక చేయడం కార్యకర్తలనే కాదు నాయకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రామచంద్రరావు ఎంపిక విషయంలో తుది వరకు బిజెపి అధిష్టానం గోప్యత పాటించింది. చివరికి మాజీ ఎమ్మెల్సీ ని నామినేషన్ దాఖలు చేయాలని పార్టీ పెద్దలనుంచి ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే అధిష్టానం నుంచి ఆ కబురు వచ్చినట్టు తెలిసిందో.. వెంటనే గోషామహల్ ఎమ్మెల్యే స్పందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా అధిష్టానం రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. వెంటనే తన రాజీనామా లేఖను ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందించారు. ఇదే సమయంలో ఆయన హై కమాండ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. హై కమాండ్ వైఖరిపై ఆగ్రహంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజాసింగ్ వెల్లడించారు.
రాజాసింగ్ ఉదంతాన్ని మర్చిపోకముందే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ సామాజిక మాధ్యమాలలో కీలక ప్రకటన చేశారు.. వ్యక్తిగత కారణాలవల్ల పార్టీలో జరిగే అధికారిక కార్యక్రమాలకు తాను హాజరు కాలేకపోతున్నానని ప్రకటించారు. ధర్మపురి అరవింద్ ఇటీవల తన నియోజకవర్గంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పిలిచారు. ఆరోజు కార్యక్రమంలో ధర్మపురి అరవింద్ ఉత్సాహంగా ఉన్నారు. మరుసటి రోజు అధ్యక్షుడిగా రామచంద్రరావును అధిష్టానం ఖరారు చేయడంతో ఆయన ఒక్కసారిగా మనస్థాపానికి గురయ్యారు. పార్టీ కార్యాలయానికి కూడా రాలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించిన మరుసటి రోజు అంటే మంగళవారం నాడు తన సామాజిక మాధ్యమాలలో.. వ్యక్తిగత కారణాలవల్ల పార్టీ కార్యక్రమాలకు ఈరోజు హాజరు కాలేకపోతున్నానని ఒక పోస్ట్ చేశారు.
రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ధర్మపురి అరవింద్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. అధిష్టానం పై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేకపోయినప్పటికీ.. తన ఆగ్రహాన్ని ఇలా పరోక్షంగా వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవిపై అరవింద్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే హై కమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆయన అంతర్మథనంలో పడ్డారని తెలుస్తోంది. అందువల్లే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం.