Maadhavi Latha: పార్లమెంటు ఎన్నికల వేళ అందరినీ ఆకర్షిస్తున్న లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్ ఒకటి. మజ్లిస్ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానంలో ఆ పార్టీ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1984 నుంచి 1999 వరకు ఆరుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుంచి 20019 వరకు ఆయన కొడుకు ప్రస్తుతం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్థానం ఎంఐఎం అధీనంలోనే ఉంటోంది. ఈ సారి ఎలాగైనా ఎంఐఎంను హైదరాబాద్‌లో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ జనపపార్టీ. ఈ క్రమంలోనే ఇక్కడ కొంపెల్ల మాధవీలతను అభ్యర్థిగా బరిలో దించింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి హైదరాబాద్‌పై పడింది.
ఎవరీ మాధవీలత..
హిందుత్వ ప్రచారంతో కొన్ని నెలలుగా మీడియా, సోషల్ మీడియా ప్రచారంతో అనూహ్యంగా వెలుగులోకి వచ్చారు మాధవీలత. తెలంగాణ బీజేపీతో సంబంధం లేకపోయినా ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో ఆమె హైదరాబాద్ టికెట్ తెచ్చుకున్నారు. దీంతో స్థానిక నేతలు మాధవీలతపై గుర్రుగా ఉన్నారు. అయితే నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచే మాధవీతల ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షిస్తుండడం, అందులో పాల్గొంటున్న నేతల గురించి ఆలోచిస్తుండడంతో స్థానిక నేతలంతా సైలెంట్‌గా ఉంటున్నారు. ప్రచారంలో మాధవీలతతో పాల్గొంటున్నారు.
మోదీ ట్వీట్‌తో మరింత ప్రాధాన్యం..
ఇక ఇటీవల మాధవీలత ఇండియా టీవీ నిర్వహించిన ఆప్‌కి అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియోను మోదీ స్వయంగా వీక్షించారు. అందులో ఆమె చెప్పిన సమాధానాలు, స్ఫూర్తిదాయక వ్యాఖ్యలను చూసి స్వయంగా ట్వీట్ చేశారు. మాధవీలత ఆప్‌కీ అదాలత్ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని కోరారు. దీంతో మాధవీలతకు మరింత ప్రాధాన్యం పెరిగింది. సీనియర్ నేతలు ఎందరో ఉన్న బీజేపీ సభ్యత్వం లేకుండానే టికెట్ తెచ్చుకుని, ఇప్పుడు మోదీలో కీర్తింపబడడంతో మాధవీలత పేరు మరింత మార్మోగింది. మోదీ ట్వీట్‌తో మాధవీలత కార్యక్రమానికి 3.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఎంఐఎం కట్టడికే..
హైదరాబాద్‌లో ఎంఐఎంను కట్టడి చేయడం అంత ఈజీ కాదు. ఒవైసీని ఢీకొట్టడం పెద్ద సవాల్. కానీ దానిని బీజేపీ స్వీకరించింది. ఆ బాధ్యతను మాధవీలత భుజస్కందాలపై పెట్టింది. దీంతో ఆమెకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. తద్వారా ఒవైసీ ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం చేస్తోంది. మరి బీజేపీ టార్గెట్ ఏమేరకు నెరవేరుతుందో చూడాలి.