New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు జారీ మొదలు పెట్టనుంది. ఈమేరకు ఇప్పటికే గతంలో ప్రజాపాలన(Praja Palana)లో వచ్చిన దరఖాస్తులు, తర్వాత కుల గణన సందర్భంగా నమోదు చేసిన వివరాలతో సర్వే నిర్వహించింది. ప్రస్తుతం లబ్ధిదారుల జాబితా ఆమోదం ప్రక్రియ జరుగుతోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తోంది. ఇది పూర్తయిన వెంటనే పథకాలు అమలు చేస్తుంది. రేషన్ కార్డుల(Ration cards)కు దరఖాస్తులకు వస్తున్న స్పందన నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని నిర్ణయించింది. తాజాగా సభల్లో వచ్చే దరఖాస్తులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్(Hydarabad)లో మాత్రం రేషన్ కార్డులు ఇప్పుడే జారీ చేయకూడదని నిర్ణయించింది.
కొనసాగుతున్న సభలు..
ఇదిలా ఉంటే.. రేషన్ కార్డుల జారీపై గ్రామ, వార్డు, బస్తీ సభలు కొనసాగుతుఆన్నయి. ఇప్పటికీ ఇంకా హైదరాబాద్‌లో మాత్రం సభలు మొదలు పెట్టలేదు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈనెల 26వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జారీ చేసే అవకాశం లేదు. కొంత ఆలస్యంగానే కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పెరుగుతున్న దరఖాస్తులు..
ఇదిలా ఉంటే.. ప్రజాపాలన సభలు, మీ సేవ కేంద్రాలకు అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్న అర్హులను గుర్తిస్తున్నామని మంత్రులు తెలిపారు. అర్హుల పరిశీలన సమయాన్ని పొడిగించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 24 వరకు సభలు పూర్తి చేయాలని భావించినా గడువు సరిపోయే అవకాశం లేదు. దీంతో గడువు పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
26 నుంచి రాష్ట్రమంతా..
ఇదిలా ఉంటే హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం జనవరి 26(January 26) నుంచే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కూడా ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ఇందిరమ్మ ఇళ్లు మొదట సొంత స్థలం ఉన్నవారికే ఇస్తారు. వారికి విడత వారీగా రూ.5 లక్షలు చెల్లిస్తారు. ఈమేరకు ఇప్పటికే ఎంపీడీవో కార్యాలయాల్లో మోడల్ ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. ఇక సాగు యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా, భూమిలేని కూలీలకు ఉపాధి హామీ పనిదినాల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తారు.