Phone Tapping Case
Phone Tapping Case: గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి రోజుకొక సంచలన విషయంలోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులను అరెస్టు చేశారు.. రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వంటి వారు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారిని కోర్టు అనుమతితో విచారిస్తున్న పోలీసులు.. విచారణలో వారు చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తుంటే కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు కనిపిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావు పై ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు.. ఈ కేసులో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు చెప్పిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్సీ నవీన్ రావు అతిథి గృహంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో..
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి కూత వేటు దూరంలో ఎమ్మెల్సీ నవీన్ రావుకు గెస్ట్ హౌస్ ఉంది. ఈ గెస్ట్ హౌస్ నుంచే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన గెస్ట్ హౌస్ నుంచి అప్పటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఆపరేషన్ సాగించినట్లు తెలుస్తోంది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం కంటే నవీన్ రావ్ అతిథి గృహాన్ని భుజంగరావు ఎక్కువగా వాడుకున్నట్టు సమాచారం.. నవీన్ రావ్ గెస్ట్ హౌస్ ను ఫోన్ ట్యాపింగ్ కు డెన్ గా వాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. “ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ ఆపరేషన్లు మొత్తం నవీన్ రావు అతిథి గృహంలోనే చేపట్టినట్టు” ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితులు విచారణ సమయంలో తెలిపినట్టు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు నవీన్ రావ్ అత్యంత సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భుజంగరావు నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఉన్న ఆధారాలు మొత్తం మాయం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
నేడో, రేపో విచారణకు..
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో నేడో, రేపో ఎమ్మెల్సీ నవీన్ రావు ను పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. నవీన్ రావు తో పాటు మరో ఎమ్మెల్సీ కి కూడా ఈ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్సీ ఎవరనేది పోలీసులు బహిరంగంగా చెప్పడం లేదు. విచారణకు వస్తే ఆ ఎమ్మెల్సీ ఎవరనేది తేలుతుంది. ఇదిలా ఉండగా..ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నల్లగొండ జిల్లాలో పనిచేసే ఒక కానిస్టేబుల్ పేరు వినిపిస్తోంది. ఆయన దీనిని అడ్డుగా పెట్టుకొని 40 మంది మహిళల ఫోన్ కాల్స్ విని.. వారిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే పోలీసులు అతడి వ్యవహార శైలి పట్ల దృష్టి సారించారని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో అతడిని విచారణకు పిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.