MLA Defection Case: తెలంగాణలో గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. దీంతో అధికార పార్టీలో ఉండాలన్న లక్ష్యంతో ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికలు జరిగిన మూడు నెలలకే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత స్టేషన్‌ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా దానం బాటలో నడిచారు. దీంతో బీఆర్‌ఎస్ శిబిరంలో ఆందోలన మొదలైంది. అప్రమత్తమైన బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు.. హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పాడి కౌశిక్‌రెడ్డితో పిటిషన్ వేయించారు. ఇక స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. గతనెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో విచారణ ప్రారంభించాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించింది. దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.
డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన ఎమ్మెల్యేలు..
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అనర్హత విషయంలో 20 రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలకు నిరాకరించింది. దీంతో ఈ కేసు ఒక్కసారిగా బిగ్ టర్న్ అయింది. అనర్హత పిటీషన్లను స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది.
వేటు తప్పదా..
డివిజన్ బెంజ్ స్టేకు నిరాకరించడంతో ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సింగిల్ బెంచ్ గడువు సమీపిస్తోంది. దీంతో స్పీకర్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయం కూడా ఎలా ఉంటుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి వస్తే.. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌పై వేటు పడుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అక్టోబర్ 24న పిటిషనర్ల వాదనలు వింటామని డివిజన్ బెంచ్ స్పష్టం చేయడం కాస్త ఊరటనిచ్చే అంశం.